హడావుడి తగ్గింది. అంతా సైలెంట్ అయిపోయింది. జంపింగ్‌ల ఊసేలేదు. ఆ ముగ్గురికి తప్ప అందరికీ కండువా కప్పేస్తామన్న హస్తం పార్టీ డైలమాలో పడిందట. వలసలతో ఉక్కిరిబిక్కిరి అయిన బీఆర్ఎస్ పార్టీకి రిలీఫ్ లభించినట్లయింది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోతారని..ఇక ఆ పార్టీలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. 10మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత వలసల జోరు ఆగిపోయింది. దానికి బీఆర్ఎస్ వేసిన స్కెచ్చే కారణమన్న చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం, ఇంకో వైపు అనర్హత వేటు భయంతో వెళ్లాలనుకున్న వారు కూడా బ్యాక్ స్టెప్ వేశారట.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ, తర్వాత సీఎల్పీలు విలీనం అయినట్లే బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి భరోసా కల్పించడం ఒక ఎత్తు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేలా మరో వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడేలా న్యాయపోరాటం కొనసాగుతోంది. దీంతో బీఆర్ఎస్‌లోనే ఉండాలా..లేకపోతే జంప్ అవ్వాలా అని గోడ మీదున్న ఎమ్మెల్యేలు కూడా కారులోనే కంటిన్యూ అవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గులాబీ పార్టీకి కలిసి వచ్చాయన్న చర్చ జరుగుతోంది.
మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని బీఆర్‌ఎస్ వాయిస్ వినిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో గిరిజనులపై జరిగిన దాడి వ్యవహారం కూడా అధికార పార్టీకి కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాలున్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట. కనీసం ఒక్క ఎమ్మెల్యే మీద వేటు పడినా ఫిరాయింపుల కథ ముగిసే పరిస్థితి అయితే కనిపిస్తోంది.