ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నుంచీ పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరో పెను సవాల్ ఎదురుకాబోతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై కొరడా ఝళిపిస్తున్న వీరికి ఇప్పుడు మరో కీలక అంశంలో చర్యలు తీసుకోవాలా వద్దా అనే మీమాంస ఎదురుకాబోతోంది. దీనికి అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీపై జరుగుతున్న విచారణ కేంద్ర బిందువు కానుంది.
గతంలో భారత్ లో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం మన దేశంతో పాటు అమెరికాకు చెందిన పలువురు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. అయితే అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీతో పాటు మరికొందరు గ్రూప్ ఉద్యోగులు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా లంచాలు ఇచ్చి సదరు ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించారు. ఇలా సంపాదించిన అనుమతులపై అమెరికా పెట్టుబడిదారులు అక్కడి కోర్టుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో గౌతం అదానీపై అమెరికా ఎఫ్ఐబీ అభియోగాలు మోపింది. వీటిపై అమెరికా కోర్టు స్పందించి అదానీ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చిందన్న వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ను పలుమార్లు కలిసి ఈ సోలార్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న గౌతం అదానీ ఇందుకోసం రూ.1750 కోట్లు లంచాలుగా చెల్లించినట్లు ఎఫ్బీఐ చెబుతోంది. దీంతో ఇప్పుడు ఏపీకి సంబంధించి ఆ ఒప్పందాల్లో అవినీతి సొమ్ము అందుకున్న వైసీపీ ప్రభుత్వ పెద్దల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోందన్న చర్చ మొదలైంది. సాధారణంగా అయితే ఇలాంటి పాయింట్ దొరికితే చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్లేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది అదానీ.
ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ అమల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని అదానీ గ్రూప్ లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు పెట్టేందుకు ఇచ్చిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు విచారణ సాకుతో జగన్ పై చర్యలు తీసుకోవడం మొదలుపెడితే ఇది అంతిమంగా గౌతం అదానీ మెడకు చుట్టుకుంటుంది. దీంతో చంద్రబాబు జగన్ పై చర్యలు తీసుకునే సాహసం చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.