మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు సీరియస్ అయ్యారు. బుధవారం ప్రెస్ మీట్ లో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పొస్ట్ చేస్తూ.. ఎక్స్ లో సంచలన హెచ్చరికలు చేశారు ఏబీ వెంకటేశ్వర రావు.


తనకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వర రావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ వంటి రిటైర్డ్ అధికారులను ఓ జట్టుగా తయారు చేసి.. చంద్రబాబు తన వద్ద కుర్చోబెట్టుకుని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా ఏబీవీ స్ట్రాంగ్ గా స్పందించారు.


ఇందులో భాగంగా... "మిస్టర్ జగన్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. మాట సరిచేసుకో.. భాష సరిచూసుకో! ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా.. ఒకసారి నోరు జారినా... తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. తెరవెనుక బాగోతాలు నడపను" అంటూ ట్వీట్ చేశారు.


ఇదే సమయంలో... చంద్రబాబు ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారులనూ ఓ జట్టుగా తయారు చేశాడంటూ జగన్ చెబుతున్న వీడియో బైట్ ను పోస్ట్ చేసిన ఏబీ వెంకటేశ్వర రావు... "నేనేంటో.. తలవంచని నా నైజం ఏంటో గడిచిన ఐదేళ్లలో నువ్వు చూశావ్.. బీ కేర్ ఫుల్.. ఫర్ ది రికార్డ్ నిన్న నువ్వు నా గురించి చెప్పిందంతా పచ్చి అబద్దం" అని అన్నారు.


కాగా... ఏబీ వెంకటేశ్వర రావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ వంటి రిటైర్డ్ అధికారులను ఓ జట్టుగా తయారు చేసిన చంద్రబాబు తన వద్ద కుర్చోబెట్టుకున్నారని.. వీరు జిల్లాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తున్నారని.. ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో ఫాలో అప్ చేస్తున్నారని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.


తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ అనేది లేకుండా నిబంధనలకు విరుద్దంగా కేసులు బనాయిస్తున్నారని.. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారని.. అరెస్ట్ చేయబడినవారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని విమర్శించారు. దీనిపై తాజాగా ఏబీవీ ఘాటుగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: