మహారాష్ట్రలో కనీవినీ ఎరగని మెజారిటీ వచ్చింది అని బీజేపీ పెద్దలు సంతోషించే లోపే విషాద పర్వాలు కూడా చోటు చేసుకుంటున్నారు.  షిండేని సీఎం చేయాల్సిందే అని ఆయన వర్గం ఎమ్మెల్యేలు నినదిస్తున్నారు.  మహారాష్ట్రలో ఉత్తమ సీఎం గా షిండే పేరునే జనాలు ఎక్కువగా చెప్పారని ఆయన రెండేళ్ళ ప్రజా రంజక పాలన వల్లనే మహాయుతి కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని చెబుతున్నారు.


బీజేపీ అధినాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం చేయడానికి చూస్తోంది.  ఒకటి రెండు రోజులలో దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.  ఈ మొత్తం పరిణామాలతో కలత చెందిన ఏక్ నాథ్ షిండే పూర్తి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆ మౌనం వెనక ఏముంది అన్నది ఎవరికీ తెలియడం లేదు.  మొత్తం 57 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న షిండే రగిలిపోతున్నారని అంటున్నారు.  అది మహా సంక్షోభానికి దారి తీస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.


షిండేకి కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన దానికి ససేమిరా అంటున్నారని భోగట్టా.  దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఏమిటి అని ఆయన అనుచరులు మండిపడుతున్నారు


గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విధంగా సీఎం గా చేసి డిప్యూటీ సీఎం చేశారు కదా అని గుర్తు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ఎంతో బలంతో పాటు సామాజిక వర్గం దన్ను ఉన్న షిండే ఈ ఆఫర్లను అంగీకరించడం లేదని అంటున్నారు. ఆయన సీఎం పదవినే కోరుకుంటున్నారు అని అంటున్నారు.   షిండే విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలకమైన వ్యాఖ్యలు చేశారు.


బీజేపీ అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవేంద్ర ఫడ్నవిస్ నే ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన కుండబద్ధలు కొట్టారు.  షిండే దగ్గర 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహా వికాస్ అఘాడీ వద్ద 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఈ రెండు కలిస్తే 106 నంబర్ అవుతుంది. ఇది రాజకీయంగా పెద్ద నంబరే. ఈ రోజు కాకపోయినా రేపు అయినా ఈ నంబర్ తో డేంజరే.  అందువల్ల విపక్షం వైపుగా షిండే మళ్లకుండా బీజేపీ హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉందని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: