తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం గా ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం జరపడమే ఇందుకు నిదర్శనం. ఈ సందర్భంగా తెలంగాణాలో బీజేపీ గెలిచి తీరాలని మోడీ వారికి సూచించినట్లుగా చెబుతున్నారు.
బీజేపీ తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది అని ఆయన చెప్పారు. ప్రజలు బీజేపీ మీద ఆశలు పెట్టుకున్నారని మోడీ వారితో వివరించారు. బీజేపీని పటిష్టం చేసే కార్యక్రమాలను శ్రీకారం చుట్టాలని కోరారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మోడీ అన్నట్లు తెలిసింది.
తెలంగాణాలో అసలు సిసలు రాజకీయ పక్షంగా ఆల్టరేషన్ గా బీజేపీ ఉందని అన్నారు. బీజేపీని గెలిపించేలా పార్టీ నేతలు అంతా పనిచేయాలని ఆయన కోరారు అంటున్నారు. ఇక తెలంగాణాలోని పార్టీ నేతలతో సంబంధించి నిర్వహించిన సమావేశం వివరాలను ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా పంచుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన గొంతుని గట్టిగా వినిపిస్తూనే ఉండాలని, బీజేపీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉండాలని ఎక్స్ లో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రధానితో భేటీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్ సహా ఇతర కీలక నేతలు అంతా పాల్గొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మహారాష్ట్రలో సాధించిన ఘన విజయంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. దాంతో తెలంగాణాను ఈసారి గెలిచి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దక్షిణాదిన రెండేళ్ల క్రితం బీజేపీకి కర్ణాటక రాష్ట్రం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ విజయపతాకాన్ని ఎగరేసింది. ఇక ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. ఇక పార్టీ విస్తరించి అధికారం చేపట్టాల్సింది తెలంగాణాలోనే అని కమలనాధులు డిసైడ్ అయ్యారు అని అంటున్నారు. ఈ కారణంతోనే ప్రత్యేకంగా పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మోడీ వారికి దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు.