కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం భారీగా తరలిపోతున్న విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏమి చేస్తున్నారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు.


కాకినాడ పోర్టుకు చేరుకున్న పవన్... అక్కడ నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్ తో ప్రత్యేక బోటులో సముద్రంలోకి వెళ్లి ఓడల్ని తనిఖీ చేశారు. అక్కడున్న ఓడల్లోకి రేషన్ బియ్యం ఎవరు పంపారని ప్రశ్నించారు. దీంతో... అధికారులు నీళ్లు నమిలారు. వాస్తవానికి రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు తొమ్మిది నాటికన్ మైళ్ల దూరంలో ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సిద్దమైన నౌకలో 640 టన్నుల బియ్యం పట్టుబడింది. దీన్ని నేడు పవన్ స్వయంగా వెళ్లి చూశారు.


బియ్యం అక్రమ రవాణాపై సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతుంటే ఏమి చేస్తున్నారంటూ ఎమ్మెల్యేతో పాటు అధికారులను నిలదీ శారు.  ఈ వ్యవహారం గురించి తెలుసుకునేందుకు తాను వస్తానంటే... లేదు సర్ 10,000 మంది జీవితాలు పోతాయని చెబుతున్నారని.. పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయడానికా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే... ఆ ఓడను సీజ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందన్నట్లుగా వ్యాఖ్యానించారు!


కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని.. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించి 51 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.


కాకినాడ పోర్టుకు ప్రతి రోజూ సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయని.. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైనదని.. అయితే ఇక్కడ భద్రతా సిబ్బంది మాత్రం 16 మందే ఉన్నారంటూ పవన్ తెలిపారు. మంత్రి వచ్చి తనిఖీలు చేసినా అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: