ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెంపు రెండో సారి కాగా డిస్కంలు చేసిన తాజా ప్రతిపాదనలకు ఈఆర్సి ఆమోదం తెలిపింది.  దీంతో డిసెంబర్ నెల నుంచి వినియోగదారుల పైన 9412కోట్ల రూపాయల మేర భారం పడనుంది.


ఏపీ ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిన విద్యుత్ చార్జీల పెంపు పైన వైసీపీ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది.  సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కరెంటు చార్జీలు పెంచబోను అన్న చంద్రబాబు పదేపదే అబద్దాలు చెప్పారని తేదీలతో సహా ప్రకటన చేసి టార్గెట్ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 మార్చిలో కడపలో.. ఆపై మే 27 2020 టీడీపీ మహానాడు లో కూడా చార్జీలు పెంచబోమని చెప్పామని చంద్రబాబు చెప్పారన్నారు.



ఆపై ఆగస్టు 10 2022 కార్యకర్తల టెలికాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కరెంటు చార్జీలు తగ్గించి ఉండే వాళ్ళమని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇక 2023 ఆగస్టు 2వతేదీ పులివెందులలో కరెంటు ఛార్జిలను పెంచను తగ్గిస్తానని మరోమారు చంద్రబాబు ప్రకటన చేశారని పేర్కొన్నారు.  ఆగస్టు 16 2023విజన్ డాక్యుమెంట్ విడుదల చేసి టిడిపి వస్తే విద్యుత్ చార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తామని చంద్రబాబు చెప్పారన్నారు.


నేడు వేలకోట్ల బాదుడుతో జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.  ఛార్జీలు పెంచం ఒట్టు అని 100 సార్లు జనం మధ్యలో నిలబడి హామీలు ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కగానే నిర్లక్ష్యంగా ఒట్టును గట్టుమీద పెట్టేసి వేల కోట్లు సర్దుబాటు చార్జీలు జనం మీద మోపాడని టార్గెట్ చేశారు.


చంద్రబాబు హయాంలో బాదుడే బాదుడు కొనసాగుతుందని కూటమి ప్రభుత్వం ఇది ముంచే ప్రభుత్వమని చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పదేపదే విద్యుత్తు చార్జీల పైన మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం చార్జీల బాదుకు తెరతీయడం వైసీపీకి ఆయుధంగా మారగా ఏపీ ప్రజలను సైతం షాక్ కు గురిచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: