దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఆప్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
మాజీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు ఉండదు. ఇండియా కూటమితో పొత్తుకు మేము సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే.. గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు. కాగా, ఆప్ ఆరోపణలను బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ స్పందిస్తూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకొచ్చారు. ప్రజలు సింపథీ కోసమే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ప్రకటనతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ఇండియా కూటమి నేతలు, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.