గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లోనే కాదు, ట్విట్టర్ లోనూ ట్రెండింగ్ గా మారిన ఇష్యూ "సీజ్ ది షిప్"! కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమంగా రవాణా అవుతుందనే ఆరోపణలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..షిప్ ను సీజ్ చేయమని అధికారులను ఆదేశించారు.  


పవన్ చెప్పిన "సీజ్ ది షిప్" అనే మాట సోషల్ మీడియలో ట్రెండ్ అయ్యింది.  ఈ వ్యవహారంపై ప్రభుత్వంలో కలకలం మొదలైంది. డిప్యూటీ సీఎం హోదాలో షిప్ ను సీజ్ చేయమనే అధికారం పవన్ కల్యాణ్ కు ఉంటుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆ హక్కు కేవలం కస్టమ్స్ అధికారులకు మాత్రమే ఉంటుందని అంటున్నారు!


కాకినాడ పోర్టుకు వచ్చిన ఆఫ్రికాకు చెందిన నౌక స్టెల్లా ఎల్ పనామాను సీజ్ చేయమని చెప్పే అధికారం పవన్ కల్యాణ్ కు లేదనే చర్చ తెరపైకి వచ్చింది.   ఆ నౌకలో స్మగ్లింగ్ వస్తువులు గుర్తిస్తేనే అని చెబుతున్నారు. అప్పుడు కూడా కేసు నమోదు చేసి కొన్ని రోజులు నిపివేస్తారు! ఈ స్మగ్లింగ్ చట్టం కిందకు రేషన్ బియ్యం రావని అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది.


అందువల్ల.. నిషేధిత జాబితాలోలేని ఈ బియ్యం ఉన్న నౌకను సీజ్ చేయలేమని.. ఒకవేళ అలాంటి పనిచేస్తే సరికొత్త సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారని తెలుస్తోంది.  ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్ చేయాలంటే.. దీనికి సంబంధించిన కేసును అడ్మిరాల్టి కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోని హైకోర్టు పరిధిలోకి వస్తుందని అంటున్నారు.  



అయితే... ఈ న్యాయస్థానం నౌకలు, వాటి బిల్లుల చెల్లింపుల్లో వివాదాల కేసులను మాత్రమే పర్యవేక్షిస్తుందని అంటున్నారు.  మరి రేషన్ బియ్యం ఎగుమతి ఫిర్యాదును ఈ కోర్టు స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.  ఇప్పటివరకూ బియ్యం స్మగ్లింగ్ పై ఇంతవరకూ ఏ దేశంలోనూ ఏ అడ్మిరల్టీ కోర్టులోనూ కేసు నమోదు కాలేదని అంటున్నారు. మరోవైపు బియ్యం కేసు స్మగ్లింగ్ లోకి రాదు కాబట్టి.. ఈ విషయంలో కస్టమ్స్ అధికారులు తిరస్కరణ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: