ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. కూటమి ప్రభుత్వానికి పూర్తి బలం ఉండటంతో మూడు రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్న సంగతి తెలిసిందే. వీటిని టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఒక్కోస్థానం పంచుకుంటాని ప్రచారం జరిగింది. జనసేన నుంచి నాగబాబుకు పదవి ఖాయం అంటూ ప్రచారం గట్టిగా సాగింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ సైతం త్యాగం చేశారు నాగబాబు. ఈ క్రమంలో నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా అంతా భావించారు. కానీ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి లెక్కలు మారాయి. రాజ్యసభ స్థానాలను మూడింటిలో రెండు టీడీపీ ఒక స్థానం బీజేపీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నుంచి రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసిన ముగ్గురు నేతలలో ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణలు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బీసీ నేతలే. ఈ క్రమంలో ఈ మూడు స్థానాలను తిరిగి బీసీలకే కట్టబెట్టాలనే యోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర సామాజిక వర్గాలకు కట్టబెడితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురైతే ఒక స్థానాన్ని ఇతరులకు కేటాయించే అవకాశ లేకపోలేదు అని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రెండు స్థానాలు ఆల్ రెడీ బీసీలకు రిజర్వుడ్ అయినట్లు తెలుస్తోంది. బీద మస్తాన్ రావుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఆర్ కృష్ణయ్యను కూడా తిరిగి నామినేట్ చేస్తారనే ప్రచారం ఉంది. రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మూడో రాజ్యసభ స్థానానికి భారీ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడో స్థానం టీడీపీకే కావడంతో ఆశావాహుల సంఖ్య చాలానే ఉంది. కంభంపాటి రామ్మోహన్‌రావు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సానా సతీశ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో నాగబాబు పేరు లేకపోవడంతో ఈసారి ఆయనకు కష్టమేనని తెలుస్తోంది. అయితే కాకినాడ జిల్లా నుంచి సానా సతీశ్‌కు అవకాశం ఖాయంగా తెలుస్తోంది.