అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అమెరికన్లు ట్రంప్‌కు పట్టం కట్టారు. ఆయన 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. అధికార మార్పిడికి సమయం ఉండడంతో ట్రంప్‌ తన క్యాబినెట్‌తోపాటు, వైట్‌హౌస్‌ కార్యవర్గ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు.  ఇప్పటికే చాలా మందిని మంత్రులు, వివిధ శాఖలకు అధిపతులుగా ప్రకటించారు.



ఇలా ఉంటే.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి భారీ ఊరట కల్పించి విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే పార్టీ ఓటమికి బైడెనే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన అధ్యక్ష పీఠం అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలు వస్తున్నాయి.  



అమెరికా ప్రజలకు నిజం చెప్పాలి అని.. తన జీవితం మొత్తం ఇదే సూత్రం పాటిస్తున్నానని బైడెన్‌ తెలిపారు. తన కుమారుడు హంటర్‌ను అన్యాయంగా విచారించే సమయంలో నేను చూస్తూ ఉండిపోయాను. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు అని పేర్కొన్నారు.  ఇక జరిగింది చాలని, ఈ కేసులో హంటర్‌కు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణించుకున్నాని తెలిపారు. ఓ తండ్రిగా, అమెరికా అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  


బైడెన్‌ తనయుడు హంటర్‌పై కీలకమైన కేసులు ఉన్నాయి. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్‌ ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడ సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలుచేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే హంటర్‌ డ్రగ్స్‌ అప్పటికే అక్రమంగా కొనుగోలు చేశారని అభియోగాలు ఉన్నాయి. వాటికి బానిసగా కూడా మారాడు. ఇక 11 రోజులు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడు. అదేవిధంగా కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేతపైనా కేసు నమోదైంది.


అక్రమ ఆయుధం కొనుగోలు కేసుపై ఈ ఏడాది జూన్‌లో న్యాయస్థానం హంటర్‌ను దోషిగా తేల్చింది. అయితే ఇప్పటి వరకు శిక్ష ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్‌ స్పందించారు. తీర్పును అంగీకరించారు. ఈ కేసులో తన కుమారుడికి క్షమాభిక్ష కోరబోనని ప్రకటించారు. కానీ ఇప్పుడు అధికారం అడ్డు పెట్టుకుని క్షమాభిక్ష ప్రసాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: