వైసీపీ నేతల్లో పేర్ని నాని కాస్త భిన్నం. పెద్ద మనిషిగా కనిపించే ఆయన.. జగన్ ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడే విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తుంటారుకొందరు వైసీపీ నేతల మాదిరి ముతక మాటలు మాట్లాడని ఆయన.. ప్రత్యర్థులకు మంట పుట్టేలా మాట్లాడటంలో నేర్పరి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేసేందుకు రెఢీగా ఉండే ఆయన.. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా బండలు వేసేందుకు అస్సలు వెనుకాడరు.


తాజాగా కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అడ్డుకొని.. సీజ్ ద షిప్ అంటూ సంచలనానికి తెర తీసిన ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపించిన పేర్ని నాని.. అదే సమయంలో జనసేనాని మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు చేసిన వైనాన్ని అభినందించారు. 'తనిఖీలు ఒక మంచి ప్రయత్నం. అందరూ ఆ ప్రయత్నాన్ని అభినందించాలి' అంటూ వ్యాఖ్యానించిన పేర్ని నాని.. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్ ను తనిఖీ చేసినప్పటికీ.. అక్కడే ఉన్న కెన్ స్టార్ షిప్ ను వదిలేశారన్నారు. అలా ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని నాకు సమాచారం ఉంది. నా ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కెన్ స్టార్ షిప్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు. అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలి? కెన్ స్టార్ షిప్ లోకి వెళ్లకూడదని పవన్ కల్యాణ్ కు చంద్రబాబు చెప్పారా?' అంటూ పేర్ని నాని నిలదీశారు.


పోర్టు యజమాని ఏపీ ప్రభుత్వమని.. అలాంటప్పుడు అరబిందో ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్న పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తంగా కాకినాడ పోర్టులో పవన్ క్రియేట్ చేసిన బజ్ పై కొత్త సందేహాలు కలిగేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: