రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ప్రభుత్వం గురించి ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఏం చేశామన్న దానిపై వివరించాలన్నది సీఎం ప్లాన్‌.ఈ క్రమంలోనే ముందుగా తన పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నూరిపోస్తున్నారు. ప్రజల మధ్య ఉండాలని చెబుతున్నారు. దీనికి మరో కారణం కూడా ఉంది. వచ్చే నెల నుంచి జగన్ ప్రజల్లోకి వస్తున్నారు.


సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వస్తే.. ప్రభుత్వానికి సెగ పెరుగుతుంది. ప్రజలు మరిచిపోయి న అంశాలను కూడా ప్రతిపక్షాలు గుర్తు చేస్తాయి. గతంలో చంద్రబాబు కూడా.. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యకు వచ్చాకే.. జగన్ సర్కారుకు ఇసుక వేడి తగిలింది. మద్యం పరిస్థితి తెలిసింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూడో ఏడాది నుంచే పెంచడంతో చంద్రబాబు సక్సెస్ కావడానికి ప్రజల్లోకి రావడమే కారణం. ఇదే పని ఇప్పుడు జగన్ కేవలం ఆరుమాసాల్లోనే చేస్తున్నారు.


జగన్ ప్రజల మధ్యకు వస్తే.. ఖచ్చితంగా సూపర్ సిక్స్‌పై ప్రజలను రెచ్చగొట్టడం ఖాయం. అదేసమయం లో పన్నులు, విద్యుత్ చార్జీల భారం వంటివాటిని కూడా.. ఆయన లేవనెత్తుతారు. ఇది ఒకరకంగా.. కూటమి ఎన్ని చేసినా.. ఒక్కసారి వ్యతిరేకత అంటూ మొదలైతే.. దానిని తగ్గించడం చంద్రబాబుకు కూడా కష్టమే. 2019 ఎన్నికలకు ముందు ఇదే జరిగింది. ఆయన వంగి వంగి దణ్ణాలు పెట్టినా.. ఎవరూ పట్టించుకోలేదు. అందుకే.. జగన్ కంటే ముందుగానే కూటమి ప్రజల్లోకి రావాలనేది చంద్రబాబు మాట.


ప్రజల మధ్యకువెళ్లి.. ప్రభుత్వం ఏం చేస్తున్నదీ చెప్పడం ద్వారా.. జగన్ చేసే ప్రచారానికి ముందే.. తమ ప్రొగ్రెస్‌ను ప్రజలకు వివరించాలని చూస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే.. నాయకులకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు.. తమ్ముళ్లు ఆదిశగా ప్లాన్ చేయలేదు. ఈ నెల 15-20 మధ్యలో ప్రజల మధ్యకు కూటమి నేతలు రావాలని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, దీనికి పార్టీ నాయకులు సహా .. బీజేపీ నాయకులు కూడా పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమనార్హం. దీంతో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: