ఏపీ శాసనమండలిలో వైసీపీదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే మండలి ఛైర్మన్ వైసీపీకి చెందిన వారు కావడంతో కూటమికి చిక్కులు తప్పడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు చేసారు. అలా చేసిన వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి, లేటెస్ట్ గా జయమంగళ వెంకట రమణ ఉన్నారు.
వీరంతా రాజీనామాలు చేస్తున్నారు కానీ వాటిని మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. దీంతో కూటమి సర్కార్ ఏర్పడి ఆరు నెలలు అయినా మండలిలో అయితే కొత్తగా ఎవరూ ప్రవేశించలేకపోతున్నారు. రాజీనామా చేసిన వారు సైతం టీడీపీలో చేరాలని చూస్తున్నారు. ఇక ఆ ఖాళీ అయిన సీట్లలో కొందరు కొత్త వారు చేరి మండలిలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ ప్రతిష్టంబన ఎక్కడ ఉందంటే చైర్మన్ మోషెన్ రాజు ఈ రాజీనామాలను ఆమోదించకపోవడంతోనే. దాంతో శాసనమండలిలో కూటమికి గట్టి షాక్ తగులుతోంది.
అక్కడ వైసీపీకి బలం ఉంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఈ క్రమంలో మండలిలో తమ ఎమ్మెల్సీలు జారిపోకుండా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇక మండలి ద్వారా ఎమ్మెల్సీలు కావాలని చూస్తున్న వారు అంతా ఈ పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు చూస్తే ఢిల్లీ వేదికగా దీని మీద వైసీపీ వైపు నుంచి ఒత్తిడి పెట్టేందుకు కూడా కొంత కథ జరిగింది అని వార్తలు అయితే వస్తున్నాయి.
ఒక్కసారి కనుక రాజీనామాలు ఆమోదిస్తే ఇక వెల్లువలా అదే దారి పడతారని అపుడు వైసీపీలో ఎవరినీ ఆపడం కష్టమన్న ఆలోచనతో అధినాయకత్వం ఉందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చైర్మన్ అయినా స్పీకర్ అయినా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వారి ఇష్టమే. దానికి కాల పరిమితి అయితే లేదు. అందువల్ల వారిని ఎవరు ఆదేశించలేరు. వారు ఎపుడు కావాలనుకుంటే అపుడు రాజీనామాలను ఆమోదిస్తారు. ఈ లోగా పరిశీలన చేస్తున్నామని చెప్పవచ్చు.
దీంతో ఈ విశేష అధికారాల మూలంగానే కూటమిని షాక్ తగులుతోంది అని అంటున్నారు. మండలిలో ఖాళీలు ఏర్పడితే ఇటీవలనే జనసేనలో చేరిన ఒక నేత ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా కావాలని చూస్తున్నారని టాక్. మరి ఇలాంటివి చూస్తూ చూస్తూ వైసీపీ పెద్దలు ఊరుకుంటారా అని అంటున్నారు. అందుకే తమదైన వ్యూహాన్ని రచిస్తూ కూటమికి షాక్ ఇస్తున్నారు అని అంటున్నారు.