మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏకపక్ష విజయం సాధించింది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా చిత్తుగా ఓడిపోయింది.దీంతో విపక్ష కూటమిలో పలువురు నేతలు ఈ ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇదే మహారాష్ట్రలోని ఓ గ్రామం ఫలితాలపై నివ్వెరపోయింది. తాము ఓటు వేసిన వారికి కాకుండా ఇతరులకు ఓటెలా పడిందని ప్రశ్నిస్తోంది. దీంతో ఈవీఎంల స్ధానంలో బ్యాలెట్లతో ఓసారి ఓటింగ్ నిర్వహించాలని తీర్మానం చేసుకుంది. ఆ గ్రామం పేరు మర్కడ్ వాడీ. అక్కడ ఇవాళ బ్యాలెట్లతో రీపోలింగ్ జరగనుంది.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీల్‌లో ఉన్న మర్కడ్ వాడీ అనే చిన్న గ్రామం ప్రజలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నమ్మడం లేదు. దీంతో ఇవాళ మరోసారి బ్యాలెట్లతో వారికి వారే రీపోలింగ్ నిర్వహించుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
దేశంలో అందరి కళ్లూ ఇప్పుడు మర్కడ్ వాడీ గ్రామంపైనే పడ్డాయి. అయితే దీన్ని ఇలాగే వదిలేస్తే పరిస్దితి ఎటువైపు వెళ్తుందో తెలియక పోలీసులు అక్కడ ఎల్లుండి వరకూ కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఎన్నికల నిర్వహణ అనేది ఈసీ బాధ్యత అని, ఇప్పుడు వీరు చేస్తోంది మాక్ పోలింగ్ మాత్రమే అంటున్నారు. ఎవరికైనా ఎన్నికలపై అనుమానాలు ఉంటే కోర్టుల్లో పిటిషన్ వేసుకోవాలని సూచిస్తున్నారు.
వాస్తవానికి మర్కడ్ వాడీ గ్రామస్ధులకు ఈ అనుమానాలు రావడం వెనుక శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, విజేత కూడా అయిన ఉత్తమ్ రావ్ జంకర్ ఉన్నారు. ఆయనకు మల్షిరాస్ సీటులో 13,147 ఓట్ల మెజార్టీ వచ్చి గెలిచారు. అయితే ఉత్తమ్‌రావ్ జంకర్ కు తనకు బాగా మద్దతు ఉన్న మార్కడ్‌వాడి గ్రామంలో ఆధిక్యం లభించలేదు. దీంతో బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. జంకర్ ప్రత్యర్ధి అయిన బీజేపీ అభ్యర్ధి రామ్ సత్పుటేకు ఇక్కడ వెయ్యి ఓట్లు వస్తే తనకు మాత్రం 843 ఓట్లే వచ్చాయి. ఈ పరిణామమే గ్రామస్ధుల్ని రీపోలింగ్ చేసుకునేలా చేస్తోంది.