గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.  భవిష్యత్ తరాలకు హైదరాబాద్ నగరానికి ఎలాంటి ముంపు ముప్పు లేకుండా అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం.  అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తెరమీదకు తీసుకొచ్చారు.


గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై ఫోకస్ చేయడమే హైడ్రా ప్రధాన ఉద్దేశం.   సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు.  పేద, ధనిక, పొలిటికల్, ఆఫీసర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చింది.


ఇప్పటివరకు దాదాపు 300లకు పైగా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఇందులో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ సైతం ఉంది.  ఈ సమయంలో హైడ్రా పేరు దేశవ్యాప్తంగానూ మారుమోగింది.  ముఖ్యంగా చెరువులు, కుంటల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటి భరతం పడుతోంది.  జీహెచ్ఎంసీకి సంబంధించిన పలు అధికారాలను బదలాయించారు. హైడ్రాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానికి చట్టబద్ధతను సైతం తీసుకొచ్చారు. ఇలా రోజురోజుకూ ప్రభుత్వం తరఫున హైడ్రాకు కావాల్సిన సదుపాయాలను సమకూరుస్తూ దానిని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు.  హైడ్రాకు యంత్రాలు తదితర కొనుగోలు నిమిత్తం ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది.


తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలపై ఇక నుంచి ప్రతీ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లో ఈ ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కాగా.. కొత్త ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి హైడ్రా అధికారులు ఫిర్యాదులు తీసుకోనున్నారు. వీటి ఆధారంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపడుతుందని రంగనాథ్ వెల్లడించారు.


ప్రజా ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రంగనాథ్ వెల్లడించారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే తాము ఇప్పటివరకు కూల్చివేశామని, పేదల ఇళ్లను ముట్టుకోలేదని తెలిపారు. అనుమతులు ఉన్న వేటినీ తాము పట్టించుకోలేదని తెలిపారు. అనుమతులు లేని వాటిని పక్షపాతం లేకుండా కూల్చివేశామని స్పష్టం చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై ఇప్పటికే 4 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: