ఏపీ ఉప ముఖ్యమంత్రి తెలుగు నాట అపారమైన జనాదరణ కలిగి ఉన్న టాప్ స్టార్, జాతీయ రాజకీయాల్లో నవ సంచలనంగా నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్ ని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ రావడం పట్ల సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఒక ఆగంతకుడు ఏకంగా డిప్యూటీ సీఎం ఆఫీసుకు మేసేజ్ పంపించినట్లుగా అధికారులు తెలిపారు. పోలీసులు దీని మీద సమగ్రమైన దర్యాప్తుని చేపట్టారు.
పవన్ ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన అనేక అంశాలలో తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా చాలా డేరింగ్ గా కీలక అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయం అయినా, దేశంలో సనాతన ధర్మం ఉండాలన్న దాని పైన అయినా పవన్ కచ్చితంగానే మాట్లాడుతున్నారు.
ఇటీవల పవన్ కాకినాడ షిప్ లో అక్రమంగా బియ్యం రవాణా అవుతోంది అన్న వార్తల నేపధ్యంలో తుఫానుతో ఒక పక్క అలజడిగా సముద్రం ఉన్నా బోటు వేసుకుని మరీ నడి సముద్రంలోకి వెళ్ళి షిప్ ని పరిశీలించారు. సీజ్ ద షిప్ అని అక్కడే ఆయన ఆదేశాలు ఇచ్చారు. తనను ఇక్కడకు రావద్దని అనేకమైన ఒత్తిళ్ళు పెడుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే పవన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తూ నిఘా వర్గాలు కూడా ఇటీవల అలెర్ట్ చేశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగంతకుడు ఏకంగా పవన్ పేషీకే ఫోన్ చేసి బెదిరించడం అంటే ఎక్కడికి ఈ ధైర్యం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే కోట్లాది మందికి ఆరాధన ఉంది. ఆయన వెండి తెర నాయకుడిగా కాకుండా జనాదరణ విశేషంగా ఉన్న ప్రజా నాయకుడిగా ఉన్నారు.
ఆయన రాజకీయాల వల్ల ఇబ్బంది పడే వర్గాలు ఉండొచ్చు కానీ ఈ విధంగా బెదిరింపులు చేయడమేంటి అన్న చర్చ ఉంది. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య యుతంగా తేల్చుకోవాల్సిందే అన్న మాట ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలోని బీజేపీకి అత్యంత సన్నిహితమైన మిత్రపక్షంగా ఉన్న పవన్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే కేంద్రం కూడా ఈ విషయంలో గట్టి చర్యలకు ఉపక్రమిస్తుందని అంటున్నారు.