రాష్ట్ర మంత్రివర్గంలోకి మెగా బ్రదర్ నాగబాబు చేరనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందట క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని అంతా భావించారు. వివిధ సమీకరణలో భాగంగా నాగబాబు పేరు తప్పడంతో.. ఒక్కసారిగా మంత్రి పదవి అనేసరికి అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది.
నాగబాబు ప్రస్తుతం ఏ సభలోను సభ్యుడు కారు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందే మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత నాగబాబు కదలికలపై మీడియా కన్ను అధికమైంది. ఈ తరుణంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.
మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మెగా కుటుంబం సమావేశం అయినట్లు సమాచారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సరైన సమయం ఆ కుటుంబం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అది కుదిరాక నాగబాబు విజయవాడ చేరుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్టర్ల రివ్యూ జరుగుతోంది. ఇది ఈరోజు కూడా కొనసాగనుంది. దీంతో ఈరోజు ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ లేదు. అయితే నాగబాబు ప్రమాణ స్వీకారానికి మూడు పార్టీల నేతలు, మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
నాగబాబుకు ఇచ్చే శాఖపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా హోం మంత్రి పదవి నాగబాబుకి ఇస్తారని తెగ టాక్ అయితే ఉంది. కానీ ఆ అవకాశమే లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబుకు పర్యాటకశాఖ తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందిన కందుల దుర్గేష్ వద్ద ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నాగబాబుకు ఇస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత శాఖల కేటాయింపు జరపడం ఆనవాయితీ. ముందుగా నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని.. తరువాత శాఖ కేటాయిస్తారని తెలుస్తోంది.