జమిలి ఎన్నికల దిశగా మోదీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందో అని అందరూ లేక్కలేసుకుంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటు చేసిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఇక ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
ఇదే జరిగితే కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు లాభపడగా మరికొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు నష్టపోతాయి. ఇక లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార కూటమికి (టిడిపి, జనసేన,బిజెపి) జమిలి ఎన్నికల నిర్వహణవల్ల లాభంగాని, నష్టంగాని లేదు. అలాగే ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లోనూ జమిలి ఎన్నికల ప్రభావం వుండదు.
తెలంగాణ విషయానికి వస్తే 2028 లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ 2029 లో జమిలి ఎన్నికలు జరిగితే పదవీకాలం ముగిసినా కొంతకాలం ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా ఐదారునెలలు అదనంగా పాలించే అవకాశం రేవంత్ ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే జమిలి ఎన్నికల వల్ల తెలంగాణ కాంగ్రెస్ కు లాభమే జరుగుతుంది.
ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారీ ఎన్నికలు జరిగితే కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా లాభపడగా, మరికొన్ని నష్టపోతాయి. పదవీ కాలం ముగియకుండానే అధికారాన్ని కోల్పోయేవి కొన్నయితే...పదవీకాలం ముగిసాక కూడా అధికారంలో వుండేవి మరికొన్ని. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలు లాభపడే అవకాశం వుంది. అలాగే లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు పదవీకాలం ముగియకుండానే అధికారం కోల్పోయే అవకాశం వుంది.
ఎన్డీఏ కూటమికి లోక్ సభలో 292, రాజ్యసభలో 112 మంది సభ్యుల బలం వుంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్ సభలోని 545 సీట్లకు గాను 364 సీట్లు వుండాలి. కానీ ఎన్డిఏకే అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో అంత బలం లేదు.