అయితే ఇక అల్లు అర్జున్ ఇష్యూ ముగిసింది.. తర్వాత ఎపిసోడ్ మోహన్ బాబు అరెస్టు అన్న వార్తలు వెలువడుతున్నాయి. విలేకరిపై దాడి కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చురుకుగా సాగుతోంది. అయితే.. ఈ కేసులో మోహన్‌బాబుకు నిన్న హైకోర్టు నుంచి ఊరట లభించలేదు. మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించలేదు.
మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన టీవీ9 విలేఖరి రంజిత్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ అంశంపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
మోహన్‌బాబు కుటుంబ వివాదం సందర్భంగా కవరేజీకి వెళ్లిన టీవీ9 విలేకరిపై దాడికి సంబంధించి నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్‌బాబు నిన్న ఉదయం అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ.. లంచ్ మోషన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహన్‌బాబు పిటీషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ నిన్న విచారణ చేపట్టారు. అయితే మోహన్‌బాబుకు ఊరటల లభించకపోవడంతో ఇక ఆయన్ను అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని టీవీ9 కథనాలు ప్రసారం చేస్తోంది. ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారని చెబుతోంది. అల్లు అర్జున్‌నే అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు.. మోహన్‌బాబును తప్పకుండా అరెస్టు చేస్తారని భావిస్తున్నారు.