ప్రభుత్వ పాలసీ అంటూ ఒకటి ఉంటుంది.  ఇష్టం ఉన్నా లేకున్నా దాన్ని ఫాలో కావాల్సిందే.  తొలి పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ బాస్ తీరుకు.. ఆయన మైండ్ సెట్ కు భిన్నంగా.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ధైర్యం ఏ శాఖ.. మరే అధికారి చేయలేదేనే చెప్పాలి.  కానీ రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత నుంచి.. అదే పనిగా వివిధ శాఖలు.. అధికారులు చేస్తున్న తప్పులు ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతున్నాయి.


ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగే అంశాలపై పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న మాట పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో విద్యుత్ కోతలు.. ఆ తర్వాత తాగునీరు సరఫరాలో అంతరాయాలు మొదలుకొని పలు అంశాల్లోనూ అదే పరిస్థితి.  ఈ తీరు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసే పరిస్థితి.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు.. ఆయన ఆశలకు.. ఆకాంక్షలకు భిన్నంగా పలుపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  రైతుల విషయంలో రేవంత్ సర్కారు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలని శాఖాధికారులకు స్పష్టంగా చెబుతున్నారు. అందుకు భిన్నంగా లగచర్ల ఎపిసోడ్ మొత్తం రేవంత్ సర్కారుకు ఇబ్బందులు గురి చేసేలా మారింది.


లగచర్ల ఎపిసోడ్ లో పాల్గొని ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్న రైతు హీర్యానాయక్ ఛాతీ నొప్పిగా సతమతమవుతున్నారు.  ఈ సమయంలో అతనికి ఉగ్రవాది లెక్కన చేతికి బేడీలు వేసి మరీ జైలు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ సమయంలోనూ చేతికి వేసిన బేడీలు తీయకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


కేసీఆర్ ప్రభుత్వ హయాంలో న్యాయపోరాటం చేస్తున్న రైతుల చేతులకు బేడీలు వేయటంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.  విపక్షంలో ఉన్నప్పుడు ఏ అంశంపై రియాక్టు అయ్యారో.. ఇప్పుడు అదే ఉదంతం ఆయన ప్రభుత్వంలో చోటు చేసుకోవటాన్ని తప్పు పడుతున్నారు.  అయితే.. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ విచారణకు ఆదేశించటంతో పాటు.. సంగారెడ్డి జైలర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


ఇదంతా ఓకే అన్నట్లు ఉన్నప్పటికి.. అలాంటి పరిస్థితి వరకు అధికారులు ఎందుకు వెళుతున్నారు? ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న అంశంపై సీఎం రేవంత్ మరింత ఫోకస్ పెంచాలని చెబుతున్నారు.  ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించని వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ పెరుగుతోంది. అప్పుడే ప్రభుత్వానికి ఈ తరహా చికాకులు ఉండవంటున్నారు. మరి.. ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయాన్ని గుర్తించాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: