తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో తెలంగాణ మార్క్ ఉండే విధంగా పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది .ఇప్పటికే టీఎస్ ను టీజీ గా మార్చింది .ఇక గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించింది.


నంది పేరుతో ఇచ్చే అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చాలని కూడా నిర్ణయించింది.  ఇక ఇదే క్రమంలో తాజాగా పలు యూనివర్సిటీల పేర్లను కూడా మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.  అందులో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1985 డిసెంబర్ రెండవ తేదీన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడిగా పేరున్న సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు.



ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం పైన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు.  విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.


హైదరాబాద్ లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన పొట్టి శ్రీరాములు పేరును మార్చే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తనకు బాధను కలిగించిందనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.



త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని ఆ మహనీయుని పేరు చిరస్థాయిగా ఉండేలా చూస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన తర్వాతనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎగసిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు పేరు స్థాయిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: