పోలవరంను బ్యారేజీగా మార్చేలా చంద్రబాబు పని చేస్తున్నారని.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసే కుట్రలో సీఎం చంద్రబాబు భాగస్వామిగా మారాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రెండో దశలో నిర్మించాల్సిన 45.72 మీటర్ల ఎత్తుకు కూటమి ప్రభుత్వం తాజాగా మంగళం పాడిందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం నుంచి రూ.12,150 కోట్లు మంజూరు చేసిన సందర్భంలో కేంద్రంతో చంద్రబాబు ఏం మాట్లాడాడో తెలియదని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.
మొదటి దశ నిధులు విడుదల కాగానే ఎత్తు మొదటి దశకే పరిమితం చేస్తున్నారని.. నిర్వాసితుల పునరావాసానికి ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్లు ఇవ్వకుండా తప్పించుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు సహకరిస్తున్నాడని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.తద్వారా భవిష్యత్తులో పోలవరం ఒక బ్యారేజీగానే మిగిలి పోవాల్సిన పరిస్థితి తీసుకువస్తున్నారని అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు.
గతంలో ఇలా అడ్వాన్స్‌గా కేంద్రం నుంచి ఎప్పుడూ నిధులు రాలేదన్న అంబటి రాంబాబు... నాడు వైసీపీ ప్రభుత్వం పోలవరం కోసం రాష్ట్ర నిధులు వ్యయం చేసిందని.. ఆ తర్వాత కేంద్రం ఆ మొత్తం రీయింబర్స్ చేసేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులు కేంద్రానికి పంపితే, వాటిని పరిశీలించి నిధులు విడుదల చేసే వారని అంబటి రాంబాబు అంటున్నారు. ఇప్పుడు దాన్ని వక్రీకరిస్తూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అంటున్నారు. పోలవరం నిధులను వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేసిందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అంబటి రాంబాబు అంటున్నారు.