రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కారు ఆయన్ను ఓటు కు నోటు కేసులో అరెస్టు చేయించింది. కుమార్తె పెళ్లికి కూడా రేవంత్ రెడ్డి జైలు నుంచి వచ్చి పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. అది రేవంత్ రెడ్డిని బాగా హర్ట్ చేసిందని చెప్పుకుంటారు. దాని ఫలితంగానే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లను కూడా జైలుపాలు చేయాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్టు భావిస్తున్నారు.
రేవంత్ రెడ్డి వరకూ ఆలోచిస్తే అది సబబుగానే అనిపించినా.. రాజకీయాల్లో ఈ కక్ష సాధింపు వ్యవహారం మాత్రం ఎప్పుడూ సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక విధంగా రేవంత్ రెడ్డి జైలుకు పోవడం వల్లే కాస్త సానుభూతి కూడా పెరిగి ఉండొచ్చు. ఏపీలోనూ ఇలా కక్ష సాధించాలని ప్రయత్నించి జగన్.. చంద్రబాబును జైలుకు పంపి.. పరోక్షంగా ఆయనకు రాజకీయంగా లబ్ది కలిగేలా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నారన్న భావన విశ్లేషకుల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారుపై అంత సానుకూల భావన ఏమీ ప్రజల్లో కనిపించట్లేదు. దీనికి తోడు.. ఇలాంటి కక్ష సాధింపులు చేస్తే అది వికటించే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్ కూడా ఈ పరిణామాలు ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమైపోయింది. తాజాగా తన అరెస్టు వార్తలపై స్పందించిన కేటీఆర్.. బీజేపీతో రేవంత్ రెడ్డి బేరాలు, అదానీతో భేటీ ఫలితం వచ్చినట్లుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 30 సార్లు దిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి మూడు పైసలు కూడా తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి ఆనందం పొందాలనుకుంటే మీ ఖర్మ అంటూ.. కేటీఆర్ సెటైర్ వేశారు. కేసులను చట్ట పరంగా ఎదుర్కొంటామన్నారు.