జగన్ అంటే పడి చచ్చి చొక్కాలు చింపుకునే కాలం గతించింది. జగన్ అన్నా అని నోరారా పిలిచి తమ కంటే కూడా ఎక్కువగా ప్రేమించే తరమూ తగ్గిపోయింది. జగన్ అంటే ఒకప్పుడు ఉన్న మోజు క్రేజూ కావాలనే తగ్గించేసుకున్న క్యాడర్ కి మళ్లీ పిలుపులు వలపులు స్వాగతం పలుకుతున్నాయి. మరోసారి అన్నను సీఎం గా చేద్దాం మన కష్టాలు అన్నీ ఆయన తీరుస్తారు. ఈసారి ఆయన ఉండేది క్యాడర్ పక్షమే అని హైకమాండ్ పెద్దలు ఊదరగొడుతున్నారు. గతంలో తప్పులు జరిగాయని ఒప్పుకుంటూనే ఈసారి అవి జరగనీయమని ఒట్టు వేయకుండానే గట్టిగా చెబుతున్నారు.
మరోసారి జగనన్నను సీఎం కానీయండి. కార్యకర్తలకు నచ్చేలా వారు మెచ్చేలా వారి కోసమే ఆయన పాలన చేస్తారు అని ఊరిస్తున్నారు అయితే ఇవన్నీ వింటున్న వారికి మాత్రం ఎంతో కొంత విస్మయం అయితే కలుగుతోంది. 151 సీట్లతో అయిదేళ్ల పాటు అద్భుతమైన అధికారం అందుకున్న తరువాత జగన్ క్యాడర్ కి చేసింది అయితే ఏమీ లేదని అంతా నిండు నిరాశలో మునిగితేలారు.
క్యాడర్ కంటే వాలంటీర్లే బలం అనుకుని వారిని తెచ్చి పెట్టి మరీ ఉన్న చోటనే క్యాడర్ ని నీడ విలువ లేకుండా చేశారు అన్నది నిన్ననే జరిగిన ముచ్చట. అయితే వారి కళ్ళు తెరచుకున్నాక వైసీపీ వైభవం మూసుకుపోయింది. 2024 ఎన్నికల్లో క్యాడర్ అంతగా పనిచేయలేదు అన్నది నిజమైన విశ్లేషణ. దానికి కారణాలు అందరికీ తెలుసు.
తప్పు జరిగిపోయింది అని ఈ రోజున హైకమాండ్ పెద్దలు లెంపలేసుకుని మళ్లీ గెలిపిస్తే మీకు అన్నీ చేస్తామంటూ ముందుకు రావడమే క్యాడర్ గమనిస్తున్న కొత్త ముచ్చట. ఇక 2019 సాధారణ ఎన్నికలకు ముందు జగన్ కార్యకర్తలు నా కుటుంబం అని చెప్పారు. ఆయన ప్రతీ మీటింగులో పాదయాత్రలో వారినే తలచారు. కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేశారు.
2024 ఎన్నికలకు వచ్చేసరికి కార్యకర్తలు వద్దని వారి కంటే సంక్షేమ పధకాలు తీసుకునే కోట్లాది ప్రజలే తమకు ముద్దు అని, వారే తిరిగి మళ్లీ వైసీపీని గెలిపిస్తారని కూడా హైకమాండ్ చాలా పెద్ద ఆశలనే పెట్టేసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ బహు గొప్పగా ఉందని సచివాలయం వ్యవస్థ అదుర్స్ అని వీటిని సృష్టించిన జగన్ గ్రేట్ అంటూ కోటరీ వల్లించిన మాటలకే భ్రమించి అందులోనే మునిగి తేలారు. కేవలం నాలుగు సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారం ముగిస్తే ఫలితం దారుణంగా వచ్చి 11 నంబర్ దగ్గర కూర్చుంది.