విజన్ 2020.. 1999లో చంద్రబాబు ఇచ్చిన నినాదం అది.  ఆ విజయంతో ముందుకెళ్లే క్రమంలో 2004లో ఓడిపోయారు చంద్రబాబు.  మళ్లీ పదేళ్ల తర్వాత 2014లో అధికారంలోకి రాగలిగారు. కానీ అప్పుడు విజన్ 2020 అన్న నినాదం వినిపించలేదు.  అయితే అప్పటికే ఆరేళ్లు మాత్రమే ఉండడంతో.. అది సాధ్యం కాదని తేలిపోవడంతో ఆ జోలికి పోలేదు చంద్రబాబు.



కానీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు.  బలమైన ఆశయాలతో పాటు ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఉద్యోగ,ఉపాధి కల్పనతో పాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రవాణా రంగంలో సౌకర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం వంటి విషయాలను తెలియజెప్పారు. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కావాలనే విషయాన్ని నొక్కి చెప్పారు.


1999లో విజన్ 2020 రూపొందించడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. రాష్ట్రస్థాయిలో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు, జిల్లా మండల స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 250 వర్క్ స్టేషన్ల ఏర్పాటు.. అక్కడ శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. చదువుకున్న వ్యక్తులు, వర్చువల్ గా పనిచేసే వారికి ఉద్యోగాలు ఇప్పించి ప్రోత్సహిస్తారు.


నవ్యాంధ్రప్రదేశ్ లో ఉపాధి, ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తోంది.  రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణలో ఉండిపోయింది.  ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఉండిపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడే ఉండిపోయాయి. దానిని నవ్యాంధ్రప్రదేశ్ వైపు మళ్లించాలంటే నైపుణ్యాభివృద్ధి సంస్థలు, ఐటీ పరిశ్రమలు, ఉపాధి నిచ్చే రంగాలు ఇటువైపు రావాల్సి ఉంది. దానికోసం స్పష్టంగా రూపొందించింది ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్.  చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజన్ 2020 మాదిరిగా కాకుండా.. పక్కా ఆలోచనలతో, వ్యూహాత్మకంగా గెలిచిన వెంటనే దీనిని ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన ప్రాజెక్టు ఫైల్ పై సంతకం చేశారు. అమలు చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: