చైనాలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగస్వాములైన వారిపై చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ అధికారికి ఏకంగా మరణశిక్షను విధించడం సంచలనంగా మారింది.
ఉత్తర అంతర్గత మంగోలియా స్వతంత్ర ప్రాంత అధికారిగా లీ జియాన్‌పింగ్ విధులు నిర్వహిస్తుండేవారు. ఆయన హయాంలో దేశంలో 421 మిలియన్ డాలర్ల అవినీతి వెలుగుచూసింది. భారతదేశం కరెన్సీ ప్రకారం.. రూ.3,500 కోట్ల అవినీతి జరిగింది. ఇందులో లీ ప్రమేయం ఉన్నట్లుగా ఎంక్వయిరీలో తేలింది. దీంతో ఆయన 2022లో ఓ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై ఆయన సుప్రీం పీపుల్స్ కోర్టను ఆశ్రయించారు. అక్కడ కూడా లీ మరణశిక్షకు ఆమోదం లభించింది. దీంతో మంగళవారం ఆ అధికారికి ఉరిశిక్ష అమలు చేశారు.
చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ 2012లో అధికారం చేపట్టారు. అప్పటినుంచి అవినీతి వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు. దేశంలో ఎక్కడెక్కడ అయితే అవినీతి జరుగుతున్నదో అక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడి నుంచి అయితే ఆరోపణలు వస్తున్నాయో అక్కడ విచారణలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు సైనిక అధికారులతో సహా పార్టీలోని కొంత మంది అవినీతి అధికారులను సైతం పట్టుకున్నారు. వారు ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు.
పార్టీ సభ్యులైనప్పటికీ ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వకుండా శిక్షలు విధిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా నిర్వహించిన ఓకార్యక్రమంలో జిన్ పింగ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. అధ్యక్షుడి హెచ్చరికలను పట్టించుకోని కొంత మంది అధికారులు మాత్రం తదేకంగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. దీంతో వారిని నోటిఫై చేస్తూ జిన్‌పింగ్ ప్రభుత్వం చర్యలకు దిగుతోంది.
మరోవైపు.. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపైనా చైనా సర్కార్ ఉక్కుపాదం మోపుతూనే ఉంది. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ అదృశ్యమయ్యారు. అలీబాబా గ్రూపును స్థాపించి అపర కుబేరుడి వరకు ఎదిగిన జాక్‌మా సైతం 2020లో అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఆయన కూడా ఏడాదిన్నర పాటు కనిపించకుండా పోయారు. ఇలా పారిశ్రామిక వేత్తలు, మంత్రులు సైతం చాలా కాలం కనిపించకుండా పోతుండడం దేశంలో చర్చకు దారితీసింది.