చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ రూపొందించిన కంపెనీ ఏంటి.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ జిల్లాను దత్తత తీసుకున్నారు. తెలుగు దేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడు లేఖ ఇచ్చింది వంటి ప్రశ్నలు గ్రూప్2లో అడిగారు. అలాగే ఆంధ్రా రియల్‌ఎస్టేట్ సంస్థల గురించి అడిగారు.. ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు.. వారి కంపెనీల గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి.
అయితే.. ఈ ప్రశ్నలపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇది చంద్రబాబు భజనే అని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అయితే.. ఇక్కడ ఓ లాజిక్ ఉంది. తెలంగాణకు జరిగిన వివక్ష గురించి తెలుసుకోవాలంటే.. ఆంధ్రా పాలకుల గురించి చదవాల్సిందే కదా. గ్రూప్2 సిలబస్‌లో కూడా ఈ అంశాలు ఉన్నాయి. ప్రశ్నాపత్రంలో ఎక్కడా సిలబస్‌లో లేని ప్రశ్నల గురించి అడగలేదు. మొత్తం 150 మార్కుల ప్రశ్నాపత్రంలో ఆంధ్రావారి ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుందన్న లాజిక్ మాత్రం బీఆర్ఎస్ నేతలు మిస్ అవుతున్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటం గురించి చదివేటప్పుడు బ్రిటీష్ వారి పాలన గురించి చదవకుండా ఉంటామా.. అలాంటి ప్రశ్నలు రాకుండా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంత లోతుగా ఆలోచించని వారికి బీఆర్ఎస్ విమర్శలు నిజమే కదా అని అనిపించే అవకాశం కూడా ఉంది. మరో విషయం ఏంటంటే.. టీఆర్ఎస్, కేసీఆర్ గురించి పెద్దగా ప్రశ్నలు కనిపించలేదు. ఇది కూడా బీఆర్‌ఎస్ ఆగ్రహానికి కారణం అయిఉండొచ్చేమో మరి.