జగన్ కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగారు. ఆయన 2009లో కాంగ్రెస్ ఎంపీ అయ్యారు. మరో విచిత్ర బంధం ఏంటి అంటే హస్తం పార్టీని ని ధిక్కరించే ఆయన పెద్ద లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీని స్టార్ట్ చేసి ఏపీలో తిరుగులేని లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అలా కాంగ్రెస్ తెలిసీ తెలియకో జగన్ కి బాగానే హెల్ప్ చేసింది అన్నది ఒక విశ్లేషణగా చూడాల్సి ఉంది.
వైసీపీలో నూటికి ఎనభై మంది కాంగ్రెస్ వారే చేరి కొత్త పార్టీని సత్తువ కలిగిన పార్టీగా మార్చారు. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని జగన్ సొంతం చేసుకుని దశాబ్దాల టీడీపీని ఢీ కొట్టే స్థాయికి ఎదిగారు. ఇపుడు చూస్తే 2024 లో ఘోర ఓటమి తరువాత వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు కూడా పార్టీని వదిలేసి బయటకు పోతున్నారు. దీంతో వైసీపీ డీమోరలైజ్ అవుతోంది. ప్రతీ రోజూ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ వైసీపీకి షాక్ అంటూనే ఉన్నాయి. దానిని చూసి క్యాడర్ షాక్ తింటోంది.
ఇక విపక్షంలో చూస్తే కామ్రేడ్స్ ఉన్నారు. వారిది సిద్ధాంత పోరాటం. అందువల్ల అక్కడ నుంచి ఎవరూ వచ్చే సమస్యే ఉండదు. వైసీపీని బలోపేతం చేసుకోవాలంటే కాంగ్రెస్ అన్న జవాబే వస్తుంది. ఏపీలో కాంగ్రెస్ కి ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉన్నా ఇంకా ఆ పార్టీని అట్టే బెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు కనిపిస్తారు.
షర్మిలను తెచ్చి నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు. కేంద్ర మంత్రులుగా చేసి కీలక శాఖలు చూస్తున్న వారు అంతా షర్మిల పోకడలతో దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ మీద మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరితే వైసీపీకి ఎన్నో రాజకీయ ప్రయోజనాలు చేకూరుతాయని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.
రాయలసీమ మీదుగా కోస్తా గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆకట్టుకునేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. అనంతపురానికి చెందిన మాజీ మంత్రి ఒకరు, మరో కీలక నేత కూడా ఫ్యాన్ నీడకు రావచ్చు అని అంటున్నారు. చిత్తూరు జిల్లాలోనూ మరో బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత వైసీపీలో చేరే చాన్స్ ఉందని అంటున్నారు.
గుంటూరు జిల్లాలో కూడా సీనియర్ నేతలు ఉన్నారని వారిని రప్పించాలని చూస్తున్నారు. గోదావరి జిల్లాలో ప్రముఖ నాయకులు కీలక సామాజిక వర్గాలకు చెందిన వారూ ఉన్నారు.