ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందిని భారీగా తగ్గించారు. గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి భద్రత కోసం 980 మంది సిబ్బందిని వాడేవారు. కానీ, తనకు ఆ స్థాయిలో భద్రత అవసరం లేదని, అవసరమైన మేర సిబ్బంది ఉంటే చాలని తన భద్రతా విధుల కోసం నియమించిన పోలీసులను వెనక్కి పంపారు. సీఎం సూచనలతో ఇప్పుడు ఆయన భద్రతకు కేవలం 121 మంది పోలీసు అధికారులను మాత్రమే వాడుతున్నారు.
మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉంటుంది. దేశంలో సీనియర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. పదవిలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు మాత్రమే జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంటుంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు కోరినంత మందిని సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. కానీ, ముఖ్యమంత్రి అనవసర హంగామా వద్దనుకున్నారు.
గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం 17 వాహనాలు వినియోగిస్తే ఇప్పుడు వాటి సంఖ్యను 11కి పరిమితం చేశారు. దీనివల్ల సిబ్బంది తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. తన పర్యటన సమయాల్లో ఎక్కువ సేపు ట్రాఫిక్ నిలపడం కానీ, పరదాలు కట్టడం, బారీకేడ్లు ఏర్పాటు చేయడం వద్దని చెబుతున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఇటీవల పోలవరం పర్యటనలో అక్కడి పోలీసు యంత్రాంగం ఎక్కువగా మొహరించడాన్ని చూసి అధికారులకు క్లాస్ తీసుకున్నారని చెబుతున్నారు.
సిబ్బంది సంఖ్యను భారీగా తగ్గించినా, బందోబస్తు పర్యవేక్షణకు పోలీసు శాఖ టెక్నాలజీ వాడుకుంటోంది. అటానమస్ డ్రోన్ వ్యవస్థను సీఎం సెక్యూరిటీ కోసం వాడుతున్నారు. ఈ డ్రోన్ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఉండవల్లిలో ప్రతి రెండు గంటలకు ఒకసారి గగనతలంలో చక్కర్లు కొడుతుంది. అనుమానిత వస్తువులు, కదలికలు ఉంటే వెంటనే పోలీసు కంట్రోల్ రూముకి సమాచారమిస్తుంది. ఈ డ్రోనును ఎవరూ ఆపరేట్ చేయరు. తనకు తానుగా గాల్లోకి ఎగిరి తన విధులు నిర్వహిస్తుంది. మళ్లీ యథావిధిగా తన ల్యాండింగ్ ప్లేసుకు చేరుకుని సొంతంగా చార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ అధునాతన టెక్నాలజీ కూడా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది తగ్గింపునకు ఉపయోగపడింది.