మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు రాష్ట్ర మంత్రులతో కమిటీ వేసింది. కర్ణాటక, తెలంగాణల్లో ఏపీ ఆర్టీసీ అధికారులు పర్యటించి లోటుపాట్లు తెలుసుకున్నారు. అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం మంత్రులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన రెండు రోజుల్లోనే ఉచిత బస్సు హామీని నెరవేర్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ స్కీం ప్రవేశపెడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. చూస్తుండగానే ఆర్నెల్లు పూర్తవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సంక్రాంతికైనా ఉచిత బస్సు పథకాన్ని నెరవేర్చాలని మహిళల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. 2019లో ఆప్ ప్రభుత్వం ఈ విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టింది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా ఢిల్లీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. తమిళనాడులో స్టాలిన్ సర్కార్ 2021లో ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ లభించింది. మహిళా ఉద్యోగుల సంఖ్య, వారిలో పని సామర్థ్యం పెరిగిందని పలు సర్వేలు తెలిపాయి.
2023లో కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఉచిత బస్సు పథకంపై హామీనిచ్చి అమలు చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకన్నా ముందు పంజాబ్ లో గెలిచిన ఆప్ ఢిల్లీలో వలే పంజాబ్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ విధంగా దేశంలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న ఐదు రాష్ట్రాలు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే కావడం గమనార్హం. మరోవైపు ఏపీలో ఈ పథకం అమలు అయితే బీజేపీ భాగస్వామిగా ఉన్న తొలి ప్రభుత్వంగా రికార్డు సాధించనుంది.
ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సత్ఫలితాలిచ్చిన ఉచిత బస్సు పథకంపై కర్ణాటక, తెలంగాణల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు వల్ల అనవసర ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీలో బస్సుల్లో రద్దీ మూలంగా ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమవుతోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మేలైన మార్గాన్ని అన్వేషించాలని ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది.