ఎవరైనా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. తప్పులు సరిదిద్దుకుంటారు. అందుకు అనుగుణంగా నడుచుకుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు. తన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా పర్వాలేదని భావిస్తున్నారు. ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులు నామమాత్రం అన్న భావనతో ఉన్నారు. ఆ నలుగురిని నమ్ముకున్నారు. వారే పార్టీని నట్టేట ముంచారు అనే వాదన ఉంది.
కానీ ఇప్పుడు కూడా పార్టీని వారి చేతిలోనే పెడుతున్నారు. వారినే పార్టీ సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వైసీపీ క్యాడర్ అందుకే భయపడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలను టార్గెట్ చేసుకుంటోంది. కేసులతో పాటు అరెస్టుల పర్వం సైతం నడుస్తోంది. అయితే కేసులకు ఇప్పుడు వైసీపీ నేతలు అలవాటు పడిపోయారు.దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నారు.
ఎటొ చ్చి అధినేత జగన్ తీరులో మార్పు రావడం లేదు. ఎవరితో ఐదేళ్ల పాటు వైసీపీ క్యాడర్ ఇబ్బంది పడిందో వారికే ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరువాత.. అధినేతకు, క్యాడర్ మధ్య అడ్డగోలుగా ఆ నలుగురు ఉన్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీఎంవో పనితీరు బాగా లేకుండా పోయిందని.. అధినేత, క్యాడర్ మధ్య అగాధం సృష్టించారని నేరుగా జగన్ కి ఫిర్యాదులు వచ్చాయి. అయినా సరే వాటిని పరిగణలోకి తీసుకోలేదు. దిద్దుబాటు చర్యలకు దిగలేదు.
రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించి తన అస్మదీయులైన ఆరుగురు నేతలకు అప్పగించారు. ఉభయగోదావరి జిల్లాల్లో మాజీ మంత్రి బొత్సకు చాన్స్ ఇచ్చారు. ఎన్నో రకాల విమర్శలు ఉన్న విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు కట్టబెట్టారు. వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి.. మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించారు. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే వారికి తప్పకుండా ప్రాధాన్యం ఇస్తానని సంకేతాలు పంపారు. వైసీపీ క్యాడర్ కూడా భయపడుతోంది అదే. టిడిపి కూటమి కేసులకు వారు భయపడటం లేదు కానీ.. జగన్ కోటరీతో ఎక్కువ నష్టమని ఆందోళన చెందుతున్నారు.