తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారా? తమ సమస్యలను విన్నవించునున్నారా? తాజాగా ఎదురైన సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరానున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. తీవ్ర రూపం దాల్చి తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి.
తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవని నిండు సభలో రేవంత్ ప్రకటించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో ఆందోళన చెందుతోంది. తెలంగాణపై ఆశలు వదులుకుంటుంది. అక్కడ జరిగే నష్టాన్ని సంక్రాంతిలో ఏపీలో భర్తీ చేసుకునేందుకు డిసైడ్ అయ్యింది.
ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి సంక్షోభం ఎదురైంది. అందుకే దీనికి పరిష్కార మార్గం కోసం చిత్ర పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు వారు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
సీఎం అపాయింట్మెంట్ కుదిరిన వెంటనే చంద్రబాబును వారు కలిసే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. పైగా చిత్ర పరిశ్రమ సమస్య రెండు రాష్ట్రాలతో కూడుకున్నది. అందుకే వీలైనంతవరకు ఈ విషయంలో చంద్రబాబు చొరవ చూపితే పరిష్కార మార్గం దొరుకుతుందని సినీ పెద్దలు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని సినీ పరిశ్రమ కోరుకుంది. ఈ తరుణంలో చంద్రబాబు కలుగ చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని సినీ పరిశ్రమ భావిస్తోంది. పైగా ఈ సంక్రాంతికి 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గేమ్ చేజర్ సినిమా రిలీజ్ కానుంది. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సైతం జనవరి 12న విడుదల కానుంది. మెగా, నందమూరి కుటుంబాలకు సంబంధించిన సినిమాలు కావడంతో చంద్రబాబు సైతం తప్పకుండా కలుగజేసుకుంటారని సినీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా చంద్రబాబును కలిసి ఈ సమస్యకు చెక్ చెప్పాలని అనుకుంటున్నారు.