తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుకు వేదికైందిసమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, నాగవంశీ, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని, విశ్వప్రసాద్ పాల్గొన్నారు.


హీరోలు వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ హాజరవ్వగా.. డైరెక్టర్స్ వీర శంకర్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి. సాయి రాజేష్, వశిష్ట, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పాల్గొన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.


అయితే సమావేశంలో అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. బన్నీపై తనకు కోపం ఎందుకు ఉంటుందని తిరిగి క్వశ్చన్ చేశారు. అల్లు అర్జున్ తోపాటు రామ్ చరణ్.. తనకు చిన్నప్పటి నుంచి తెలుసని అన్నారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారేనని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.


అదే సమయంలో పుష్ప-2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన విషయం తెలిసిందే. అలా జరిగినందుకే బన్నీపై సీఎం కక్ష కట్టారని జోరుగా ప్రచారం సాగింది. ఆ విషయంపై కూడా రేవంత్ స్పందించారు. ఎవరో తన పేరును మరిచిపోతే తాను ఫీల్ అవుతానా అని ప్రశ్నించారు.


తన స్థాయి అది కాదని, అలాంటి రూమర్స్ నమ్మవద్దని రేవంత్ రెడ్డి కోరారు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత.. టాలీవుడ్ పై ఉందని తెలిపారు. తాను సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అని క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ.. ప్రభుత్వంతో కలిసి పని చేయాలని అభిప్రాయపడ్డారు. సామాజిక అంశాలపై లఘు చిత్రాలు తీయాలని అన్నారు.


అయితే ఏ విషయంలో అయినా పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా.. చట్టం ప్రకారం వ్యవహరించాలని అన్నారు. అదే తన విధానమని చెప్పారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం హైదరాబాద్ లో కాంక్లేవ్ నిర్వహించాలని తెలిపారు. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను రప్పించాలని అన్నారు. ఐటీ, ఫార్మా మాదిరి సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేస్తామని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: