వైసీపీలో ఆయన ఒకే ఒక్కరుగా ఉన్నారు.  ఆయనకు మాత్రమే కేబినెట్ హోదాతో కూడిన పదవి ఉంది. అధినేత జగన్ సైతం సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు.  వైసీపీలో అయిదేళ్ల పాటు మంత్రిగా కేబినెట్ హోదాను అనుభవించిన బొత్స 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వెంటేనే ఎమ్మెల్సీగా నెగ్గి లక్కీ చాన్స్ కొట్టేశారు.ఆ విధంగా ఆయనకు శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపొజిషన్ హోదా కూడా దక్కింది.


అదే హోదా కోసం వైసీపీ అసెంబ్లీలో పోరాడినా ఫలితం లేకపోయింది.   ఇలా తనకు తగిన హోదా దక్కడంతో బొత్స కూడా తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేశారు అని అంటున్నారు.  ఆయన కాపీ టూ చంద్రబాబు కాపీ టూ గవర్నమెంట్ అంటూ లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు.  ఆయన ఏ ప్రజా సమస్యను అయినా మీడియా మీటింగు కంటే ముందే ప్రభుత్వానికి లేఖలు రాయడం అలవాటుగా చేస్తున్నరు. ఆ లేఖల దిగువన ఎటూ లీడర్ ఆఫ్ అపొజిషన్ అన్న రాజముద్ర ఉంటుంది.  దాంతో తాను రాసే లేఖలకు తగిన విలువ ఉంటుందని బొత్స భావిస్తున్నారు. ఆయన రాసిన లేఖలకు కూడా ప్రభుత్వం నుంచి జవాబు వస్తోందిట.


ఆయన తరచూ లేఖలు రాస్తూ ప్రభుత్వాన్ని ఆ విధంగా నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని కొన్ని సార్లు ఇరుకున పెట్టే విధంగానూ బొత్స లేఖలు ఉంటున్నాయి.


లీడర్ ఆఫ్ అపొజిషన్ అయ్యాక బొత్స ఇప్పటికే విశాఖ డ్రగ్ కంటైనర్ మీద ఏమి జరిగిందో చెప్పాలని లేఖ సంధించారు. అది ఇటీవలే ఒక కొలిక్కి వచ్చింది. సీబీఐ కూడా అసలు విషయం చెప్పింది. ఇక విజయనగరం భూముల విషయం మీద బొత్స మరో లేఖ సంధించారు. విద్యుత్ ఛార్జీల మీద కూడా ఆయన లేఖాస్త్రం వదిలారు. ఇలా ప్రభుత్వాన్ని ఆయన తనకు దక్కిన హోదాతో ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్నారని తద్వారా తన మీద పార్టీ మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తానికి బొత్స ఏపీలో లేఖలతో కూటమి సర్కార్ మీద రాజకీయ సమరం సాగిస్తున్నారు అని చెప్పాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: