ఎందుకంటే చంద్రబాబు తాజా మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చారు. అంతే కాదు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్త్ గ్యారెంటీ అని కూడా చంద్రబాబు ప్రకటించారు. కూటమి పార్టీల నేతలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు హామీలు ఇచ్చి వారిని నమ్మించారు కూడా. ఇంట్లో కూర్చున్నా సరే ఈ గ్యారెంటీలు వస్తాయని ప్రజలకు భరోసా ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ.. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. ఆ మేనిఫేస్టో అమలును ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మేనిఫేస్టోలో ప్రకటించినట్లు యువతకు యువగళం – ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అన్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అని కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇక తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్ళే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు ఊదరగొట్టారు. అంతే కాదు అన్నదాత– సుఖీభవ అంటూ రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు. కానీ ఎవరికైనా ఇచ్చారా అంటే అదేమీ లేదు మరి.
ఇంకా దీపం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తామని చెప్పారు.. కానీ వారు అమలు చేసింది ఒక్క సిలెండర్ మాత్రమే. ఇక ఆడబిడ్డకు నిధి పేరుతో ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు దీనిపై మాట్లాడట్లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మొత్తం మీద పెన్షన్ల పెంపు హామీ తప్ప మిగిలినవి ఏదీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గట్టు అమలు చేయట్లేదు. అందుకే చంద్రబాబు బాగానే టోపీ పెట్టారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.