2019 ఎన్నికల ఫలితాల తర్వాత 23 స్థానాలకు పరిమితమైంది తెలుగుదేశం. కేవలం 3 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఇక చంద్రబాబు పని అయిపోయింది.. చంద్రబాబు కురువృద్ధుడు అయిపోయాడు.. తెలుగుదేశం పార్టీ పుంజుకోవటం కష్టం.. ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది అని విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి పుంచుకోవటం కలలో జరిగే పని అని చాలామంది జోకులు వేశారు.


అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 151 సీట్లు సాధించి.. అపరిమితమైన మెజార్టీతో ఘనవిజయం సాధించి.. చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన లక్షలాది మంది బలమైన అభిమానులు ఉన్నారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజల మనసు గెలుచుకోవడం లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు పంపిన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వాటి ప్రభావం వల్ల ప్రజాబలం ఎప్పటికీ తనకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు.


జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొన్ని కొత్త పథకాలు దేశంలో పలువురికి ఆదర్శంగా నిలిచాయి. మ‌రీ ముఖ్యంగా పరిపాలన వ్యవస్థను గ్రామ సచివాలయంతో ప్రజలకు మరింత దగ్గర చేశారు. వాలంటరీ సేవల ద్వారా ప్రజలందరూ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటి దగ్గరికి చేరేలా చేశారు. దీంతో జగన్ మరో 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని అనుకున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా.. కాస్త సీట్లు తగ్గుతాయి తప్ప.. మరోసారి జగనే ముఖ్యమంత్రి అని అందరూ అనుకున్నారు. అలాంటి టైం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను దాదాపుగా మట్టుకరిపించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు.


ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పర్ఫెక్ట్ పాలన అందిస్తున్నారని చెప్పలేం కానీ.. మ్యానిఫెస్టో లో చెప్పని అనేక అంశాల మీద ఒక్కొక్కటిగా దృష్టి పెడుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇటు అమరావతి, అటు పోలవరం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తూ ఉండటంతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏది ఏమైనా 151 సీట్లు సాధించి మరో 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు తానే తిరుగులేని ముఖ్యమంత్రిని అవుతానని భావించిన జగన్ ను.. 11 సీట్లతో మూలను కూర్చోబెట్టటం అంటే చంద్రబాబు రాజకీయ చాతుర్యం.. ఆయన పడిన కష్టం.. ఈ వయసులో అంతా ఇంతా కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: