ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చంద్రబాబు అంటే అభివృద్ధికి చిరునామా అని అంటారు.   ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి మంత్రమే జపించారు. సంక్షేమం అన్నది ఆయనకు ఆ తరువాత ప్రయారిటీగా మారింది.  అందుకే 1999 ఎన్నికల్లో ఆయనకు అత్తెసెరు మార్కులే వచ్చాయి.


2004 నాటికి ఏకంగా అధికారం చేజారింది.  అప్పుడు కాంగ్రెస్ సంక్షేమ అజెండాతో ముందుకు వచ్చింది. దాని ముందు టీడీపీ డెవలప్మెంట్ సరితూగలేకపోయింది.  2014లో విభజన ఏపీలో ఆయన ఉచిత పధకాలు హామీలతో అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన చెప్పినవి అన్నీ చేయలేకపోయారు.  దాంతో 2019లో దెబ్బ పడింది. నిజానికి 2014 నుంచి 2019 మధ్యలో బాబు ఏపీకి రాజధాని కావాలని ఆలోచించి ఆ దిశగానే అడుగులు వేశారు. ఆయన అమరావతి రాజధాని వస్తే కనుక ఏపీ మొత్తం బాగుపడుతుందని భావించేవారు కానీ జనాలకు అభివృద్ధి కంటే సంక్షేమం మీదనే మోజు ఉందని గ్రహించలేకపోయారు.


జగన్ ఇచ్చిన అనేక ఉచిత హామీలను మెచ్చి 151 సీట్లతో ఆయనకు పట్టం కట్టారు.  ఇక 2024 నాటికి చంద్రబాబు అదే రూట్లోకి వెళ్ళారు.  తాము అధికారంలోకి వస్తే రెట్టింపు ఉచితాలు ఇస్తామని కూడా ఊరించారు.  కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క పించన్ పెంపు తప్ప మరేమీ అమలు కావడం లేదు. సూపర్ సిక్స్ అన్నది ఎక్కడో ఉండిపోయింది.  ఖజానా వెక్కిరిస్తోంది.  అమరావతిని ఈసారి చాలా సీరియస్ గా చంద్రబాబు తీసుకున్నారు. దాని కోసం నిధుల సేకరణ చేస్తున్నారు.  


పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి 80 ఏళ్ల ఆంధ్రుల కలను తీర్చిన వారిగా చరిత్రలో నిలవాలని చూస్తున్నారు.   అయితే చంద్రబాబు అభివృద్ధి మంత్రం మళ్లీ టీడీపీని అధికారంలోకి తెస్తుందా అంటే దాని మీదనే చర్చ సాగుతోంది.  


గత వైసీపీ పాలనలో అయిదేళ్ల కాలంలో సగటున ప్రతీ లబ్దిదారుని ఖాతాలో లక్ష నుంచి రెండు మూడు లక్షల దాకా పడ్డాయి.  ఇప్పుడు సంక్రాంతి వస్తోంది. అయినా కానీ బ్యాక్ ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదని లబ్దిదారులు అంటున్నారు.  ఇటీవల జనాలలోకి వస్తున్న కూటమి ప్రజా ప్రతినిధులను కూడా వారు ఇదే విషయం మీద నిలదీస్తున్నారు.


జగన్ ఉచిత పథకాలు అమలు చేసి అభివృద్ధి మరిచారు. దాంతో ఉన్నత వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఆయన పాలన మీద పూర్తి వ్యతిరేకతను పెంచుకున్నాయి.   ఉచితాలు అమలు చేయకుండా అభివృద్ధి అజెండాతో 2029 ఎన్నికలకు టీడీపీ వెళ్తే ఉన్నత మధ్యతరగతి వర్గాల ఓట్లు దండీగా పడవచ్చేమో కానీ రూరల్ సెక్టార్ నుంచి పేద వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండదన్న చర్చ కూడా ఉంది.  కాబట్టి ఏదో విధంగా కూటమి సర్కార్ సర్దుబాటు చేసుకుని సంక్షేమం కూడా చూడాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: