ఏపీలో రాజకీయం గేరు మారుస్తోంది.  ఆరు నెలలుగా కొంత స్తబ్దతగా ఉన్న పొలిటికల్ సీన్ వైసీపీ నిరసనలతో మళ్లీ మెల్లగా రూట్ లోకి వస్తొంది.   కొత్త ఏడాది వస్తూనే వైసీపీ అధినేత జగన్ జనంలోకి వస్తాను అని చెబుతున్నారు. ఆయన జనవరి నెలాఖరులో ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో ఒక షెడ్యూల్ ప్రకారం పర్యటించనున్నారు. జిల్లాలో రెండు రోజులు వంతున జగన్ పర్యటన సాగనుంది.


పార్టీని పటిష్టం చేసుకుంటూనే జనంతో మమేకం అయి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్ జనంలోకి రావాలని చూడడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం జనంలోకి రావాలని చూస్తున్నారు. ఆయన కూడా ప్రతీ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించేలా కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. జగన్ ఒక వైపు విపక్ష నేత హోదాలో వస్తూంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటనలకు శ్రీకారం చుట్టడం పట్ల చర్చ సాగుతోంది.


ఏపీలో వైసీపీని బలపడనీయకూడదు అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఏపీలో ఆరేడు నెలల కూటమి పాలన మీద జనంలో మిశ్రమ స్పందన ఉంది. దానికి కారణం సూపర్ సిక్స్ హామీలు నెరవేరలేదని దిగువ వర్గాలలో అసంతృప్తి ఉంది.


అయితే పరిస్థితి చేజారకుండా ఉండాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే చరిష్మాటిక్ లీడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ని జనంలోకి వెళ్తున్నారు అని అంటున్నారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వం అన్నింటినీ పరిష్కరిస్తుందని ప్రభుత్వ పెద్దగా భరోసా ఇచ్చేలా పవన్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు.


మరో వైపు చూస్తే ప్రభుత్వం ఆరు నెలలకే అన్ని విధాలుగా విఫలం అయింది అని జగన్ జనంలోకి రానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా మరచిపోయారని ప్రభుత్వం ప్రజలకు రిక్త హస్తం చూపిస్తోందని ఆయన బిగ్ సౌండ్ చేయనున్నారు ఇలా రెండు విభిన్న వాదనలతో పవన్ జగన్ జనంలోకి కొత్త ఏడాది రానున్నారు అని అంటున్నారు. మరి జనాలు ఎవరి వైపు చూస్తారు, ఎవరి వాదన కరెక్ట్ అని ఆలోచిస్తారు అన్న దాని మీద 2025లో ఏపీ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: