సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా విషయంలో తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్‌ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్‌ ఖాజాగూడలోని బ్రహ్మనికుంట ప్రాంతంలో హైడ్రా ఆక్రమణల తొలగింపును తప్పుబట్టింది. హైడ్రా దూకుడుకు అట్టుకట్ట వేసింది. హైడ్రా వ్యవహరిస్తున్న తీరును  హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేత గురించి నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవకముందే చర్యలు చేపట్టడమేమిటని హైకోర్టు మండిపడింది.


ఇప్పటికే మీకు ఒకసారి చెప్పాం.. అయినా మీ తీరు మారట్లేదు. ఇలాగే కొనసాగితే మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. గతంలోనే హైడ్రా కమిషనర్‌కు స్పష్టంగా చెప్పినా..  మళ్లీ అదే తీరు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది.


అసలేం జరిగిందంటే.. ఖాజాగూడలో చెరువు ఎఫ్‌టీఎల్‌ ప్రాంతమంటూ హైడ్రా అందులో నిర్మాణాలను కూల్చివేసింది. దీన్ని సవాలు చేస్తూ మేకల అంజయ్యతో పాటు మరికొంతమంది  అత్యవసరంగా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారించారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే     నం.18/ఇలో 12640 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.


అయితే  హైడ్రా అధికారులు అక్కడ విచారించిన తరువాతే చర్యలు చేపట్టారని హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదించారు. అనుమతుల్లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం 24 గంటలే సమయం ఇస్తారా అంటూ న్యాయమూర్తి హైడ్రాను నిలదీశారు. బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చారా.. అని ప్రశ్నించారు. హైకోర్టు జడ్జి కామెంట్లతో హైడ్రా దూకుడుకు అడ్డుకట్టపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: