ఈ నెల 19 తేదీన దావోస్ బయల్దేరి వెళ్లనున్న సీఎం చంద్రబాబు బృందం.. అందుకు తగిన ఏర్పాటు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ లో వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో ఏపీలో ఉన్న అవకాశాలను వివరించేలా దావోస్ లో పర్యటన షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఈసారి దావోస్ లో ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్ తో పాటు ఏపీకీ కేంద్రం ప్రత్యేకంగా స్టాల్ రిజర్వు చేసినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం అయ్యాక జరుగుతున్న తొలి దావోస్ సదస్సు ఇది. ఎలాగైనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చంద్రబాబు టీమ్ పట్టుదలతో ఉంది. అయితే గతంలోనూ చంద్రబాబు పలుమార్లు దావోస్ సదస్సులకు హాజరైనా ఆశించినంత ఫలితాలు కనిపించలేదు. ఈసారి ఏం సాధిస్తారన్నది చూడాలి. అయితే.. చంద్రబాబు దావోస్ వెళ్తే.. ఇక ఆయన అనుకూల మీడియా మాత్రం పండుగ చేసుకుంటుందనడంలో సందేహం లేదు. దావోస్ సదస్సులో చంద్రబాబే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అన్నట్టుగా కథనాలు ఇక పాఠకులకు కనువిందు చేయడం ఖాయం.