ఇప్పటికే ఏపీలో బోలెడన్ని ఎయిర్ పోర్టులు ఉన్నాయి. తిరుపతి పక్కనే ఉండే రేణుగుంట.. కడప.. కర్నూలు.. విజయవాడకు సమీపంలోని గన్నవరం.. రాజమండ్రి.. విశాఖపట్నం ఉన్నాయి. వీటిల్లో కర్నూలుకు ఎప్పుడో ఒక విమానం వచ్చి వెళ్లే పరిస్థితి. పేరుకు ఇన్ని ఎయిర్ పోర్టులు ఉన్నా.. తెలంగాణలోని హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో 20 శాతం రద్దీ కూడా ఏపీలోని అన్ని విమానాశ్రయాలకు కలిపి ఉండదు.
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో మరో ఏడు కొత్త ఎయిర్ పోర్టులు రానున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారులతో సమీక్ష జరిపిన ఆయన.. ఈ సందర్బంగా ఏపీకి వచ్చే కొత్త ఎయిర్ పోర్టు వివరాల్ని వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లి గూడెం, నాగార్జునసాగర్ , తుని, అన్నవరం, ఒంగోలు ఎయిర్ పోర్టులు రానున్నాయి. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తైందని.. రెండు దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తామని.. ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దగదర్తిలో ఎయిర్ పోర్టును 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. ? ఇందుకు 635 ఎకరాలు సేకరించారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒంగోలు ఎయిర్ పోర్టు నిర్మాణానికి 657 ఎకరాల్ని ప్రభుత్వం గుర్తించిందని.. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ లో 1670 ఎకరాల్లో.. తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో . తుని - అన్నవరం మధ్య ఎయిర్ పోర్టు నిర్మాణానికి 757 ఎకరాలు.. శ్రీసిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. కుప్పంలో రెండో దశలోఎయిర్ పోర్టును నిర్మిస్తామన్న చంద్రబాబు.. మొదటి దశలో 683 ఎకరాలు.. రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇక.. గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి డ్యాన్స్.. అమరావతి స్తూపం థీమ్ తో రూపొందించిన అక్రతులతో నిర్మించేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. విమానాశ్రయ విస్తరణ.. కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనుల్ని ఆర్నెల్లలో పూర్తి చేయాలని ఆదేశించారు.