జనవరి నుంచి మార్చివరకు రానున్న మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే అప్పుల లెక్క ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అంతకంతకూ అప్పులు తీసుకోవటం అలవాటుగామారిన రాష్ట్రాలు.. సంక్షేమ పథకాల కోసంభారీగా ఖర్చులు చేస్తున్నాయి. మార్చితో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. రానున్న మూడు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి తీసుకునే రుణాలు రూ.4.73 లక్షల కోట్లు కావటం గమనార్హం.


దీనికి సంబంధించిన వివరాల్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు కలిపి జనవరిలో రూ.1.47 లక్షల కోట్లు.. ఫిబ్రవరిలో 1.51 లక్షల కోట్లు.. మార్చిలో రూ.1.74 లక్షల కోట్లను అప్పుగా తీసుకోన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల అప్పుల లెక్కేమిటంటే.. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం భారీగా అప్పులు తీసుకోనుంది.


రానున్న మూడు నెలల్లో తెలంగాణ రూ.30వేల కోట్లు తీసుకోనుండగా.. ఏపీ రూ.11 వేల కోట్ల మేర అప్పు చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే జనవరి.. ఫిబ్రవరి.. మార్చి నెలల్లో ప్రతి నెలా రూ.10వేల కోట్ల చొప్పున అప్పు తీసుకోనున్నారు. ఏపీ సైతం జనవరిలో రూ.4వేల కోట్లు.. ఫిబ్రవరిలో రూ.5వేల కోట్లు.. మార్చిలో రూ.4వేలకోట్లు తీసుకున్నట్లుగా ఆర్ బీఐ షెడ్యూల్ ను విడుదల చేసింది.


ఈ మూడు నెలలకు 12 వారాల్లో ఏ వారం ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకునే జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణ ప్రతి వారం అప్పు చేసేందుకు వీలుగా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మొత్తం 12 వారాల్లో ఆరు వారాల్లోనే రుణాల్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. అంతకంతకూ పెరుగుతున్న అప్పులు భారంపై ప్రజల్లో అవగాహన పెరగటంతో పాటు.. వాటిని ప్రభుత్వాలు సమర్థంగా వినియోగిస్తున్నాయా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.  మరి ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు వీరు ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: