టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటే ఒకపుడు సీనియర్లు ఎందుకో దూరం పాటించేవారు. తాము సుదీర్ఘ కాలం రాజకీయంగా అనుభవం సాధించామని చంద్రబాబుకే తప్ప ఎవరికీ జవాబుదారీ కాదు అన్న ఆలోచనలో నాడు కొంతమంది సీనియర్లు ఉండేవారు అని చెబుతారు. నాడు లోకేష్ రెండేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు.


అయితే టీడీపీ ఓడాక లోకేష్ రాటు తేలారు. రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. విపక్షంలోకి టీడీపీ వచ్చిన మొదటి రెండేళ్లలోనూ లోకేష్ మీద సీనియర్లు పరోక్ష కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.  పార్టీ లేదు ఏమీ లేదు అని ఒక సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి.  లోకేష్ మీదనే ఆయన ఈ కామెంట్స్ చేశారు అని కూడా చెప్పుకున్నారు.


ఇపుడు అదే సీనియర్ నాయకుడితో సహా చాలా మంది లోకేష్ తో కనిపిస్తున్నారు. లోకేష్ నాయకత్వం వద్దు అని పార్టీలు మారిన వారు కూడా ఇపుడు కూటమి మిత్రపక్ష పార్టీలలో ఎమ్మెల్యేలుగా ఉంటూ లోకేష్ ని కలుస్తున్నారు అంటే ఆయన ప్రాభవం ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే అంటున్నారు.


యువగళం పాదయాత్ర తరువాత పార్టీలో లోకేష్ ఇమేజ్ మారింది. పార్టీ మీద పట్టు పెరిగింది. ఎన్నికల్లో ఆయన టికెట్ల పంపిణీ విషయంలో ఈసారి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు ఫలితంగా చాలా మంది కొత్త వారికి టికెట్లు దక్కాయి.  అంతే కాదు మంత్రివర్గం కూర్పులో కూడా ఆయన మార్క్ ఉందని అంటారు. ఇక నామినేటెడ్ పోస్టులతో పాటు ఇటీవల రాజ్యసభకు టీడీపీ అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ లోకేష్ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు


దాంతో లోకేష్ పట్ల సీనియర్ల ఆలోచనలు మారుతున్నాయి. లోకేష్ తోనే ఉండేందుకు ఆయన కనుసన్నలలో పడేందుకు చాలా మంది ప్రయత్నిస్తునారు. ఆయనకు దగ్గరగా ఉంటే తమకు మరింత మేలు జరుగుతుందని భావించే వారు కూడా ఉన్నారు. ఒకవేళ సీనియర్లుగా తమకు టికెట్లు వచ్చే ఎన్నికల్లో దక్కకపోయినా వారసులకు టికెట్లు దక్కుతాయన్న ఉద్దేశ్యంతో కూడా లోకేష్ తో ఉంటున్నారు.


మొత్తం మీద చూస్తే టీడీపీలో లోకేష్ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోతూ వస్తోంది. రానున్న కాలంలో టీడీపీని నడిపించాల్సింది లోకేష్ కాబట్టి ఆయనకు అన్ని విషయాలు అర్థం కావాలని బాబు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అని అంటున్నారు. దీంతో తెలియకుండానే సీనియర్లు కూడా లోకేష్ కి కనెక్ట్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: