సోలార్, విండ్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి తీసుకొచ్చిన సూర్యఘర్ పథకం అద్భుతమైన పథకమన్నారు. రాయితీతో సౌర విద్యుత్తును పొందవచ్చని.. మొదట్లో డబ్బులు చెల్లించాలి..మూడేళ్ళ తరువాత ఉచిత విద్యుత్ తో పాటు మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని అన్నారు. సూర్యఘర్ పథకం వల్ల ఇంటికి, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ను పొందవచ్చన్నారు.
ఇకపై కుప్పం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలను నడిపే విధంగా చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు.. వాయుకాలుష్యం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి…ఎలక్ట్రిక్ వాహనాల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు.. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చాలని సూచించారు.
హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న సీఎం చంద్రబాబు.. ప్రకృతి వ్యవసాయంతో తయారుచేసిన కూరగాయలనే తినాలని సూచించారు. రసాయనిక ఎరువులతో పండించిన పంటలకు దూరంగా ఉండండి.. చెత్త నుంచి ఎరువులు తయారుచేసే ప్రక్రియను కొనసాగిస్తున్న వారిని అభినందిస్తున్నాను.. గత ఐదేళ్ళలో రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు.. యువతను మాదకద్రవ్యాలకు బానిసలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 ఆవిష్కరించిన సీఎం.. రాబోయే ఐదేళ్లు, రాబోయే 22 ఏళ్లలో కుప్పం అభివృద్ధి లక్ష్యంగా విజన్ రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులపై ప్రణాళికలు రూపొందించామని.. పట్టుదల ఉంటే చదువు తక్కువైనా ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని సూచించారు.