ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల సమయంలోనే జగన్ పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు గాను 11చోట్ల సిట్టింగ్‌ల‌ను మార్చేసింది వైసిపి. ఈ క్రమంలోనే వైసీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా విజయం సాధించ‌ని పరుచూరు నియోజకవర్గంలో పాత అభ్యర్థులు మార్చి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపారు జగన్. అసలు వైసీపీ ఆవిర్భావం నుంచి పరుచూరులో చాలామంది ఇన్చార్జిలు మారిపోయారు. ముందు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య ఇన్చార్జిగా ఉండేవారు.. ఆయన మరణం ఆయన వారసుడు గొట్టిపాటి భరత్ కు 2014 ఎన్నికలలో సీటు ఇస్తే ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వరకు రావి రామనాథం ఇన్చార్జిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వగా ఆయన కూడా ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి రావి రామనాథం పార్టీలోకి తీసుకుని పగ్గాలు అప్పగించారు.


ఆయ‌న వ‌ల్ల కూడా ప‌రుచూరులో పార్టీ బ‌ల‌ప‌డ‌ద‌ని డిసైడ్ అయ్యి.. ఆయనను తప్పించి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు కొన్ని రోజులు ఇన్చార్జి ఇచ్చారు. ఆయన కూడా ఎన్నికలకు ముందు వెళ్లిపోవడంతో చీరాలలో గతంలో వైసిపి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎడం బాలాజీకి ఇన్చార్జి ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోయాక నియోజకవర్గం లో అడ్రస్ లేకుండా పోయారు ఇలా పరుచూరు నియోజకవర్గంలో అసలు ఎవరిని నమ్మాలో తెలియక జగన్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. తాజా ఎన్నికల ఓడిపోయాక ఎడం బాలాజీ అమెరికా వెళ్ళిపోయారు. అస‌లు పార్టీ అధిష్టాన నేత‌ల ఫోన్లు కూడా ఆయ‌న ఎత్త‌డం లేద‌ట‌. ఈ క్రమంలోనే జగన్ మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు.


మూడు వ‌రుస విజ‌యాల‌తో పరుచూరును త‌న కంచుకోట‌గా మార్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుపై ఇప్పటికే కమ్మ - కాపు ప్రయోగాలు చేసి చేతులెత్తేసిన జగన్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్ రెడ్డికి ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆయన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. గతంలో మధుసూదన్ రెడ్డి తండ్రి గాదె వెంకటరెడ్డి పర్చూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బాపట్లకు మారిపోయారు. ఆయన స్వగ్రామం పరుచూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండల పరిధిలోకి వస్తోంది. ఏది ఏమైనా జ‌గ‌న్ వేసిన ఈ కొత్త‌ ఈక్వేషన్ కూడా రాంగే అని వైసీపీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp