ఫార్ములా ఈ కార్‌ కేసులో కేటీఆర్‌ను త్వరలో అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్‌ లభించకపోవడంతో ఇక బీఆర్‌ఎస్‌ డిఫెన్సులో పడినట్టు కనిపిస్తోంది. అంతే కాదు.. ఇక బీఆర్‌ఎస్‌ నేతలపై వరుసగా కేసులు పెట్టేందుకు రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్‌ రెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది.



సంక్రాంతి పండుగ తరువాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే భూదాన్, దేవాదాయ, అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ  ఫోరెన్సిక్ ఆడిట్ లో బయట పడతాయంటున్నారాయన. అంటే భూకుంభ కోణాలపైనా కేసులు నమోదు కానున్నాయన్నమాట. ఇప్పటికే సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందన్న వార్తలు వ్యాపించాయి.



సిరిసిల్లలో కొందరు భూములు వెనక్కి కూడా ఇస్తున్నారు. ఇంకా రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుందని మంత్రి పొంగులేటి అంటున్నారు. ఇప్పటికే సియోల్ బాంబులు పేలడం మొదలు అవుతున్నాయని మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది...ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నదని మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంటే విద్యుత్‌ ఒప్పందాలపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది.



ఇక అన్నింటి కంటే పెద్దది కాళేశ్వరం కాంట్రాక్టుల అంశం. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అవ్వలేదు.. కొనసాగుతుందన్నారు. అంటే కాళేశ్వరం అంశంపై విచారణ.. ఫోన్ ట్యాపింగ్‌.. ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో చేసిన అక్రమాలన్నింటి పైనా రేవంత్ రెడ్డి విచారణ జరిపించేలా ఉన్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ కూడా ఇదే విషయం చెప్పారు. మాపై ఇంకా చాలా కేసులు పెడతారని.. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని కేటీఆర్ అన్నారు. అంటే మరో నాలుగేళ్లు ఈ కేసుల కొట్లాటలే సరిపోతాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: