ఏలూరు మాజీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ పొలిటిక‌ల్ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నారు. తండ్రి దివంగ‌త మాజీ మంత్రి.. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు కోట‌గిరి విద్యాధ‌ర‌రావు రాజ‌కీయ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ్రీథ‌ర్ వైసీపీ నుంచి 2019 ఎన్నిక‌ల్లో తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ఏలూరు ఎంపీగా ఘ‌న‌విజ‌యం సాధించారు. ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్న ఆయ‌న వివాద ర‌హిత రాజ‌కీయాల‌తో పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రి మ‌న్న‌న‌లు పొందారు. అటు అమెరికాలో వ్యాపారాలు.. కుటుంబం బాధ్య‌త‌ల‌కు తోడు ఇటు ఎంపీగా ఉన్నా పొలిటిక‌ల్‌గా త‌న తండ్రిలా ముద్ర వేయ‌లేక‌పోయారు. గ‌త ఎన్నిక‌ల‌కు యేడాది ముందే తాను ఈ సారి పోటీ చేయ‌న‌ని అధిష్టానానికి చెప్పేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న శ్రీథ‌ర్ ఈ సారి పొలిటిక‌ల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యాక్టివ్ కానున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డం.. ఎన్నిక‌ల త‌ర్వాత శ్రీథ‌ర్ అమెరికాలోనే ఉండ‌డంతో ఆయ‌న ఇక తిరిగి రాజ‌కీయాల్లోకి రాన‌ట్టే అని ఆయ‌న అభిమానులు కాస్త డీలా ప‌డ్డారు.
త‌న‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడిలో కుడిభుజంలా ఉండే మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ద‌శ‌దిశ క‌ర్మ రోజునే తాను నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటాన‌ని.. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి అపోహ‌లు వ‌ద్ద‌ని క్లారిటీ ఇచ్చేశారు. అనంత‌రం కూడా నియోజ‌క‌వ‌ర్గంలోని త‌నకు స‌న్నిహితులు అయిన వారికి ఈ యేడాదిలో రాజ‌కీయంగా మ‌రింత యాక్టివ్ అవుతాన‌ని క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.


సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాభ‌వంతో.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీ చేస్తుందా ? అన్న సందేహాల వేళ శ్రీథ‌ర్ చింత‌ల‌పూడి కేడ‌ర్‌తో గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్య‌ర్థులు పోటీలో ఉండాల‌ని కూడా చెప్పేశార‌ట‌. అవ‌స‌రం అయిన మేర‌కు ఆర్థిక విష‌యాల‌కు త‌న సాయం ఉంటుంద‌ని కూడా సంకేతాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇక శ్రీథ‌ర్ తిరిగి యాక్టివ్ అయ్యే అంశం ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలో చ‌ర్చ‌కు రావ‌డంతో పాటు అధికార కూట‌మి నాయ‌కుల్లో సైతం ఆయ‌న పొలిటిక‌ల్ క‌ద‌లిక‌ల‌పై చ‌ర్చ న‌డుస్తోంది.


ఈ సారి పార్ల‌మెంటుకా... అసెంబ్లీకా..?
ఏలూరు జిల్లా ప‌రిధిలో మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మారిపోయారు. నాని పార్టీ వీడాక పార్టీ అధినేత జ‌గ‌న్‌తో పాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కూడా శ్రీథ‌ర్‌ను తిరిగి యాక్టివ్ చేయించ‌డంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు కూడా తెలిసింది. జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా దూలం నాగేశ్వ‌ర‌రావు ఎంపిక‌తో పాటు త‌న పార్ల‌మెంటు ప‌రిధిలో త‌నకు కావాల్సిన వాళ్ల‌కు రాష్ట్ర‌, జిల్లా స్థాయి ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డంలోనూ తెర‌వెన‌క ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఏలూరు జిల్లా ప‌రిధిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇన్‌చార్జ్‌లు శ్రీథ‌ర్‌తో క‌లిసి ప‌ని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీథ‌ర్ ఈ సారి పొలిటిక‌ల్ గా యాక్టివ్ అయితే మ‌ళ్లీ పార్ల‌మెంటు రేసులో ఉంటారా ?  లేదా త‌న‌కు ఇష్ట‌మైన అసెంబ్లీ రేసులో ఉంటారా ? అన్న‌ది కూడా చూడాలి. 2026లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఉండ‌డంతో ఈ సారి చింత‌ల‌పూడి లేదా జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఏర్ప‌డే అసెంబ్లీ సీట్ల‌లో ఒక‌టి శ్రీథ‌ర్‌కు ఆప్ష‌న్‌గా ఉండొచ్చు. ఏదేమైనా శ్రీథ‌ర్ సెకండ్ ఇన్సింగ్స్ ఆయ‌న అభిమానుల్లో మంచి జోష్ నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: