ఏపీలో నిన్నటిదాకా రాజ్యమేలిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోతున్నట్లుగా కేంద్రం సంకేతాలు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా వైసీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే అఖిలపక్షంతో కేంద్రాన్ని కలుద్దామని ఆనాడు విపక్షాలు చెప్పినా వైసీపీ పట్టించుకోలేదు. మొత్తానికి వైసీపీ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయబోమన్న ఒక్క మాటను కేంద్రం చేత చెప్పించ లేకపోయింది.
విశాఖతో పాటు ఉత్తరాంధ్రాలో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే రావడం వెనక ఉక్కు కార్మికుల ఆగ్రహం కూడా ఉందని విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడవచ్చు. ఆనాడు టీడీపీ జనసేన ఇదే చేశాయి. మరి వైసీపీ అయితే విశాఖ ఉక్కు మీద గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదూ అన్న చర్చ సాగుతోంది. బలం తక్కువగా ఉన్నా కాంగ్రెస్ తన గొంతు వినిపిస్తోంది.
విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కు మీద కీలక ప్రకటన చేయాల్సిందే అని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటంలో మొదటి నుంచి చురుకుగా పాల్గొంటున్న వామ పక్షాలు అయితే మోడీ విశాఖ వస్తున్న వేళ తమ గొంతుని మరింతగా పెంచాయి.
మరి వైసీపీ నుంచి ఎందుకు ఈ తరహా ఆందోళనలు కనిపించడం లేదు అన్న చర్చ సాగుతోంది. మరి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్న వేళ వైసీపీ తన డిమాండ్ ని ఆయన ముందు పెట్టాలి కదా అని అంటున్నారు. ఉక్కు లాంటి ఈ సమస్యను కీలక పార్టీ అయిన వైసీపీ టేకప్ చేసి ఉంటే పొలిటికల్ గా కూడా మైలేజ్ వేరే లెవెల్ లో వస్తుంది కదా అని అంటున్నారు.
ప్రజల మనసెరిగి సరైన సమయంలో అంది పుచ్చుకుని చేసే కార్యక్రమాలతోనే ప్రతిపక్షాలకు పేరు వస్తుంది. ఆ విధంగా బంగారం లాంటి చాన్స్ వైసీపీకి వచ్చిందని అంటున్నారు. దానికి ఆ పార్టీ సద్వినియోగం చేసుకోవాల్సింది అని అంటున్నారు. కానీ వైసీపీ అయితే ఎందుకో ఈ నిరసన విషయంలో సైలెంట్ అయింది అని అంటున్నారు.