ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాను ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల నుంచి కామవరపుకోట, నల్లజర్ల, తడికలపూడి లాంటి చిన్న చిన్న పల్లెటూర్లు.. సీ సెంటర్లలో కూడా జనసేన పార్టీ నాయకులు భుజానకెత్తుకున్నారు. అర్ధరాత్రి బెనిఫిట్ షోలు కొనుగోలు చేయడం.. గురువారం రాత్రి నుంచే థియేటర్ల దగ్గర హంగామా చేయడంతో గేమ్ ఛేంజర్ హంగామాను ఓ రేంజ్‌లో చేశారు. పైగా గోదావరి జిల్లాల నడిబొడ్డున రాజమహేంద్రవరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరై ఈ సినిమాతో ఈ సంవత్సరం బాక్స్ బద్దలు కొట్టాలని చెప్పడంతో పాటు చరణ్‌ను ఈడు నా తమ్ముడు అంటూ ఆకాశానికెత్తేయడం లాంటి పరిణామాలు కూడా జనసేన కేడర్‌లో ఈ సినిమా పట్ల మరింత అభిమానం పెంచేశాయి. అందుకే వీళ్లు గేమ్ ఛేంజర్ రిలీజ్‌ను ఓ పండగలా చేసుకుంటున్నారు.
జనసేన ప్రజా ప్రతినిధులు సైతం గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలకు అటెండయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి కొందరు మొదటి రోజే జనసేన కేడర్‌తో కలిసి సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాను ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రముఖ పంపిణీ దారులు ఎల్‌వీఆర్ పంపిణీ చేస్తుండడంతో తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని అన్ని సెంటర్లతో పాటు మెజార్టీ స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తొలి రోజు బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో ఇలా క్లోజ్ అయిపోయాయి. ఏలూరు ఎస్వీసీ మల్టీఫ్లెక్స్‌లో అర్ధరాత్రి 4 బెనిఫిట్ షోలు టిక్కెట్లు గురువారం మధ్యాహ్నానికే అయిపోయాయి. ఏదేమైనా గోదావరిలో జనసేన కేడర్ గేమ్ ఛేంజర్ క్రేజ్‌ను రెట్టింపు చేసింది.